హథీరాంజీ మఠం గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు తిరుమల వేంకటేశ్వరస్వామితో కలిసి హథీరాంజీ పాచికలు ఆడినట్లు పురాణాలు చెబుతున్నాయి. తిరుమలతో పాటు తిరుపతిలోను ఎన్నో విలువైన ఆస్తులు హథీరాంజీకు ఉన్నాయి.
అయితే గత కొన్ని నెలలుగా హథీరాంజీమఠంకు సంబంధించిన భూములు అన్యాక్రాంతానికి గురవుతున్నాయి. దాంతో పాటు హథీరాంజీ పరిధిలోని ఆలయాలకు సంబంధించిన నగలు మాయమవుతున్నాయి. ప్రధానంగా తిరుమలలోని జపాలీకి చెందిన నగలు మాయమయ్యాయి.
నగలు మాయమైన సమయంలో అక్కడ సెక్యూరిటీగా పనిచేస్తున్న బసవరాజుపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అతన్ని అప్పట్లో విచారించి వదిలేశారు. కానీ ఇప్పటికీ అతనే సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. తిరుపతిలోని హథీరాంజీ మఠంలో సెక్యూరిటీ గార్డుగా విధులను నిర్వర్తిస్తున్నాడు బసవరాజు.
అయితే ఈ రోజు సాయంత్ర మహంతు అర్జున్ దాస్ బసవరాజును గట్టిగా ప్రశ్నించడంతో కోపమొచ్చి బ్లేడుతో పీక కోసేసుకున్నాడు. రక్తపు మరకలతో రోడ్డుపైకి వచ్చి అరగంట పాటు తిరిగాడు బసవరాజు. చాలాసేపటి తరువాత బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. తిరుపతి రుయా ఆసుప్రతిలో ప్రస్తుతం బసవరాజు చికిత్స పొందుతున్నాడు.