ప్రస్తుతం మందు (మెడిసిన్)లకు మాత్రమే ఎక్స్పైరీ డేట్ వేస్తుంటారు. ఆహార పదార్థాలకు తయారు చేసే తేదీని ఇచ్చినా, ఎక్స్పైరీ డేట్ మాత్రం ఇవ్వరు. ఇకపై, ప్యాకెట్లలో వచ్చే ఫుడ్డుకూ ఎక్స్పైరీ తప్పనిసరి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్స్పైరీ డేట్ ఒక్కటే కాదు, దాంతో పాటు ‘బెస్ట్ బిఫోర్ డేట్(అంటే, ఏ తేదీ లోపు వాడుకుంటే మరింత బాగుంటుందో చెప్పేది)’ కూడా వేయాల్సి వస్తుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఈ కొత్త రూల్స్‌పై ప్రతిపాదనలు పెట్టింది.
వినియోగదారులకు మరింత స్పష్టమైన సమాచారం, ఆరోగ్యవంతమైన ఫుడ్డును అందించడమే లక్ష్యంగా ఈ కొత్త రూల్స్‌ను తయారు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు, బెస్ట్ బిఫోర్ డేట్ దాటితే దానిపై వినియోగదారుడు ‘డిస్కౌంట్’ అడిగే అవకాశాన్ని కల్పించనున్నారు. తద్వారా ఆహార వృథాను అరికట్టే ప్రయత్నం చేయనున్నారు. ఇప్పటిదాకా ఎక్స్పైరీ డేట్‌ను నిర్ణయించే విధానాలేవీ లేకపోవడంతో, బెస్ట్బిఫోర్ డేట్ దాటగానే వాటిని సంబంధిత కంపెనీలకు పంపించేస్తున్నారు. దీంతో కంపెనీలూ వాటిని నాశనం చేసేస్తున్నాయి.
ఆ వృథాను తగ్గించడంలో భాగంగానే ఈ కొత్త రూల్స్‌కు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ‘‘ఇలాంటి బెస్ట్ బిఫోర్ డేట్ దాటిన ఫుడ్డు కూడా కొద్ది రోజుల వరకు తినేందుకు వీలుగానే ఉంటుంది. వాటిని నాశనం చేయడం వల్ల ఆహారం మొత్తం వృథా అయిపోతోంది. అందులో ఎక్కువగా పోషకాహారమే ఉంటోంది” అని ఓ అధికారి చెప్పారు. డేట్ దగ్గర పడుతున్న సరుకులపై చాలా షాపులు ఆఫర్లు పెడుతూ అమ్మేస్తున్నాయని, అలాంటి సందర్భంలో వినియోగదారులు ఆ ఫుడ్డు ఎన్ని రోజుల వరకు వాడుకోవచ్చో అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వాటిపై మరింత డిస్కౌంట్ అడిగేందుకు వారికి అవకాశం కలుగుతుందన్నారు.