రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కళాశాలలు సంబంధిత కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. వీటి ద్వారా సుశిక్షితులైన యువతను వివిధ రంగాలకు అందించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారు.
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఐదు రోజుల అధ్యాపక అభివృద్ధి కార్యక్రమం ఉద్దేశించి డిజిటల్ వేదిక ద్వారా అమరావతి నుండి సోమవారం రాత్రి మంత్రి మాట్లాడారు.
2020-2025 కొత్త ఇన్నోవేషన్ పాలసీను ప్రభుత్వం తీసుకురానుందని చెప్పారు. కరోనా కారణంగా పలు రంగాల మాదిరి విద్యా రంగం కూడా సవాళ్లను ప్రస్తుతం ఎదుర్కుంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
పరీక్షలు, తరగతుల నిర్వహణపై అన్ని వర్గాలు మేధావులు, తల్లిదండ్రుల అభిప్రాయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. విభజన అనంతరం రాష్ట్రంలో విద్యారంగానికి, పారిశ్రామిక రంగానికి దూరం కొంత పెరిగిందని, దాన్ని అధిగమించే ప్రయత్నం విశ్వవిద్యాలయాలు చేయాలి అని సూచించారు.
స్టార్టప్‌లతో ఉపాధి, ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. స్టార్టప్ ఇంకుబేషన్ వంటి అంశాలపై దృష్టి సారిస్తే ఉపాదితో పాటు ఉజ్వల భవిషత్తు ఉంటుందని జాతీయ పరిశోదన అభివృద్ధి సంస్థ న్యూఢిల్లీ సీఎండీ హెచ్.పురుషోత్తం సూచించారు.
ఐదు రోజుల అధ్యాపక అభివృద్ధి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రత్యేక ప్రసంగం చేశారు "ఎమర్జింగ్ స్టార్టప్ ఆపరేషన్ ఫర్ యూత్ పోస్ట్ కోవిడ్-19 " అంశంపై ఆయన మాట్లాడారు.