Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేపు 1068 అంబులెన్స్ లు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టరు

రేపు 1068 అంబులెన్స్ లు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టరు
, మంగళవారం, 30 జూన్ 2020 (08:17 IST)
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన రెడ్డి చేతులు మీదుగా జూలై 1న 108- 104 అంబులెన్స్ వాహనాల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టరు ఏ.యండి.ఇంతియాజ్ తెలిపారు.

పోలీస్ ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి భద్రతా అధికారులు, ఆరోగ్యశ్రీ, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్తు, రోడ్లు భవనాలు, తదితర శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ముందస్తు భద్రతా ఏర్పాట్లు పై సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. విజయవాడ నగరంలోని బెంజిసర్కిల్ వద్ద బుధవారం ఉదయం జరగనున్న కార్యక్రమంలో 1068 అంబులెన్స్ వాహనాలను సీఎం జగన్మోహన్‌ రెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు.

ఇంత పెద్ద సంఖ్యలో వాహనాలను ప్రారంభించడం చారిత్రాత్మకమైన విషయం అని అన్నారు. కరోనా వంటి విపత్తు సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 104,108 వాహనాలను అందుబాటులోకి తేవడం ప్రజలకు, అధికార యంత్రాంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

ప్రతి జిల్లాకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కనీసం 80కు పైగా వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారని తెలిపారు.

విజయవాడ న‌గ‌ర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ.. బుధవారం ఉదయం 9గంటలకు సీఎం జగన్మోహన రెడ్డి బెంజిసర్కిల్ దగ్గర అంబులెన్స్ వాహనాలను ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం మూడంచెల విధానంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపడుతున్నామని తెలిపారు.

ప్రకాశం జిల్లా నుండి వచ్చే వాహనాలను త్రోవగుంట వద్ద, కృష్ణా జిల్లాకు వచ్చే వాహనాలను హనుమాన్ జంక్షన్ వద్ద, కనకదుర్గ వారధిపై నుంచి వచ్చే భారీ వాహనాలను విజయవాడ నగర ట్రాఫిక్ సమస్యకు ఇబ్బంది లేకుండా మంగళవారం అర్ధరాత్రి నుండి దారి మళ్లింపున‌కు చర్యలు తీసుకుంటామన్నారు.

అదేవిధంగా ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని బుధవారం ఉదయం నుంచి నగరంలోని ట్రాఫిక్‌ను కూడా క్రమబద్దీకరించడం జరుగుతుందని తెలిపారు.

ఉదయం 9.00 గంటల నుండి సుమారు గంటపాటు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటార‌ని చెప్పారు. ట్రాఫిక్ మళ్లింపునకు సంబంధించి ప్రత్యేక పత్రికా ప్రకటనను కూడా జారీ చేస్తామ‌న్నారు.

అడ్వాన్స్ సెక్యూరిటీ లైజనింగ్‌ను పర్యవేక్షించిన వారిలో ఇంటెలిజెన్స్ ఓయడి శశిధర్ రెడ్డి, విజయవాడ సబ్ కలెక్టరు హెచ్.యం.ధ్యానచంద్ర, విజయవాడ నగర డిసిపి హర్షవర్ధన్ రాజు, పోలీస్ అధికారులు అప్పలనాయుడు, ఉదయరాణి, అడిషినల్ సిఇఓ (ఆరోగ్యశ్రీ) బి.రాజశేఖర రెడ్డి, అడిషినల్ మున్సిపల్ కమిషనర్‌ మోహనరావు, పోలీస్ అధికారులు యల్.అంకయ్య, యం.మురళీధర్, యన్.సూర్యచంద్రరావు, నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వచ్చిన వారిపట్ల వివక్ష తగదు..అలాంటి వ్యక్తులపై క్రిమినల్ చర్యలు : నల్లగొండ ఎస్పీ