సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి భారత ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. దేశంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా జనసేనను ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధినేత పవన్‌కు ఈసీ లేఖ రాసింది. అలాగే, జనసేనకు కేటాయించిన గాజుగ్లాసు గుర్తును రిజర్వు చేస్తున్నట్టు తెలిపింది. తాజా ప్రకటనతో కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా జనసేన అవతరించింది. ఇకపై గాజు గ్లాసు గుర్తును కేవలం జనసేన పార్టీకి మాత్రమే కేటాయిస్తారు. స్వతంత్ర అభ్యర్థులకు కూడా ఈ ఎన్నికల గుర్తును కేటాయించడానికి వీల్లేదు.
కాగా, గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ సీట్లలో పోటీ చేసి 100 శాతం స్ట్రైక్ రేటుతో అన్ని స్థానాలను గెలుచుకుంది. దీంతో స్వతంత్ర భారతావనిలో వంద శాతం విజయాన్ని సొంతం చేసుకున్న ఏకైక పార్టీగా జనసేన అవతరించి దేశం యావత్ తమవైపు చూసేలా చేసింది. దీంతో భారత ఎన్నికల సంఘం కూడా జనసేన పార్టీకి గుర్తింపు ఇవ్వడంతో పాటు గాజు గ్లాసు గుర్తును శాశ్వతంగా ఆ పార్టీకి కేటాయించింది.