Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వైన్ ఫ్లూ వ్యాధి... భయం వద్దు... చంద్రన్న వాహనం వస్తుంది...

Advertiesment
Dont fear about Swine flu
, శనివారం, 10 నవంబరు 2018 (17:43 IST)
అమరావతి: స్వైన్ ఫ్లూ వ్యాధికి కారణమవుతున్న హెచ్ వన్ఎన్వన్ వైరస్ గురించి భయపడాల్సిన పనిలేదని సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో గత ఏడాదికన్నా నాలుగు నెలలు ముందుగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అవుతున్నాయని ఆమె గుర్తుచేశారు. ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల అక్టోబరులోనే స్వైన్ ఫ్లూ కేసులు బయటపడుతున్నాయని పూనం మాలకొండయ్య వెల్లడించారు. 
 
ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 21 వరకు, 223 కేసులు గుర్తించడం జరిగిందని, ప్రస్తుతం 37 మంది స్వైన్ ఫ్లూ రోగులు పలు ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆమె తెలిపారు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణిలు, వృద్ధులు ఈ వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రలోని అన్ని బోధనాసుపత్రుల్లో ఈ వ్యాధి నిర్ధారణ కేంద్రాలు అందుబాటులో ఉంచినట్టు పూనం మాలకొండయ్య తెలిపారు. 80 ప్రాంతాల్లో ఇప్పటికే 352 మంచాలు, 66 వెంటిలేటర్లు, అవసరమైన మందులు అన్నీ సిద్దంగా ఉంచామని, అవసరమైతే వాటి సంఖ్య పెంచడానికి కూడా సిద్దంగా ఉన్నామని ఆమె చెప్పారు.
 
గత ఏడాదితో పోల్చుకుంటే స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య తగ్గాయన్నారు. దేశంలోని మిగతా రాష్ట్రాలకన్నా ఏపీలో ఈ వ్యాధి తక్కువగా ఉందని, ప్రజలు భయపడాల్సిన పనిలేదని ఆమె సూచించారు. గత ఏడాది అక్టోబర్ 21 నాటికి 475 కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం 223కు తగ్గాయని గుర్తుచేశారు. స్వైన్ ఫ్లూ విస్తరించకుండా రాష్ట్ర వ్యాప్తంగా 11762 అవగాహనా క్యాంపులు నిర్వహించడంతోపాటు, బస్ స్టాండులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో 4,16,565 మందికి పరీక్షించినట్టు ఆమె తెలిపారు. వ్యాధి పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు రద్దీగా ఉండే అన్నీ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు.
 
ఎక్కడైనా స్వైన్ ఫ్లూ కేసు నమోదైతే అక్కడ 5 కిలోమీటర్ల పరిధిలో వ్యాధి వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. మెప్మా, డ్వాక్రా గ్రాపుల ద్వారా పాఠశాలలు, కాలేజీల్లో స్వైన్ ఫ్లూపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి గ్రామంలో చంద్రన్న సంచార చికిత్సా వాహనాల ద్వారా ప్రచారం చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని పూనం మాలకొండయ్య వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన క్యాంపుల్లో 1,90,905 మంది పాల్గొన్నారని ఆమె తెలిపారు. 
 
వ్యాధి సోకకుండా తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవడం, దగ్గేప్పుడు, తమ్ములు వచ్చేప్పుడు గుడ్డ అడ్డుగా పెట్టుకోవడం, నీరు బాగా తాగడం, పౌష్టికాహారం తీసుకోవడం, అనుమానం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధి విస్తరించకుండా అడ్డుకోవచ్చని పూనం మాలకొండయ్య సూచించారు. వరుసగా మూడు రోజులు జ్వరం, దగ్గు, జలుబు ఉంటే సమీపంలోని ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుని, తగిన చికిత్స పొందాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరలా కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పనున్న డి.శ్రీనివాస్