Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మినరల్ వాటర్ తాగే వాళ్లు కూడా అస్వస్థతకు గురవుతున్నారు...

Advertiesment
Eluru Mysterious Illness
, సోమవారం, 7 డిశెంబరు 2020 (21:29 IST)
వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరు పట్టణ ప్రజలను ఓ అంతు చిక్కని వ్యాధి పట్టి పీడిస్తోంది. ఇప్పటికే 300 మందికిపైగా ప్రజలు ఈ వ్యాధిబారినపడ్డారు. ఈ మాస్ట్ హిస్టీరియా వ్యాధిపై పగో జిల్లా కలెక్టర్ ఓ నివేదిక తయారు చేశారు. 
 
ఇందులో ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇప్పటివరకూ వింత వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాపించలేదన్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగానే ఉందన్నారు. బాధితులకు మూర్ఛ ఒకసారి మాత్రమే వస్తోందన్నారు. మున్సిపల్‌ నీరు పంపిణీలేని ప్రాంతాల్లో కూడా అస్వస్థతకు గురయ్యారని కలెక్టర్ నివేదికలో పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా, ప్రతి రోజూ మినరల్‌ వాటర్‌ తాగే వాళ్లు కూడా అస్వస్థతకు గురయ్యారన్నారు. నీటి శాంపిల్స్‌, రక్త నమూనాల రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయన్నారు. ఇంకా కల్చర్‌ రిపోర్టు రావాల్సి ఉందని నివేదికలో కలెక్టర్‌ వెల్లడించారు. విశ్లేషణ కోసం సీసీఎంబీకి నమూనాలు పంపామన్నారు. కుటుంబ సర్వే ద్వారా 191 మంది అస్వస్థతకు గురైనట్టు గుర్తించామని కలెక్టర్‌ వెల్లడించారు.
 
డబ్ల్యూహెచ్ఓ బృందం రాక
ఇదిలావుంటే ఈ అంతు చిక్కని వ్యాధి వ్యవహారం ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి వెళ్లింది. దీంతో డబ్ల్యూహెచ్ఓ రంగంలోకి దిగింది. ఈ వ్యాధిని శోధించేందుకు ప్రత్యేక వైద్య బృందం ఏలూరుకు రానుంది. 
 
నిజానికి గత రెండు మూడు రోజులుగా ఈ అంతు చిక్కని వ్యాధి పట్టిపీడిస్తోంది. అసలు ఈ వ్యాధేంటి..? ఎందుకిలా వస్తోంది..? అనేదానిపై వైద్యులు కూడా తెలుసుకోలేకపోతున్నారు. మూడు రోజుల వ్యవధిలోనే 443 మందికి పైగా ఆస్పత్రిపాలయ్యారు. వీరిలో 243 కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 16 మందిని విజయవాడకు తరలించారు.
 
ప్రస్తుతం ఏలూరు ఆసుపత్రిలో 183 మంది చికిత్స పొందుతున్నారు. ఈ తరుణంలో ఏలూరులో అసలేం జరుగుతోంది..? జనాలకు ఇంతగా ఇబ్బంది పడుతున్నారు..? ఇంతకీ ఆ వింత వ్యాధి ఏంటి..? అని తెలుసుకోవడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి వైద్య బృందం మంగళవారం నాడు ఏలూరుకు రానుంది. 
 
ఈ బృందం ఏలూరులో వింత వ్యాధిగా సంచలనం రేపుతున్న వైనంపై అధ్యయనం చేయనుంది. ఈ బృందంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు ఉన్నారని వైద్య అధికారులు మీడియాకు సమాచారం ఇచ్చారు. ప్రపంచ దేశాల దృష్టి పడటంతో వ్యాధిని నిర్ధారించేందుకు డబ్ల్యూహెచ్‌వో బృందం రానుంది.
 
అత్యవసరంగా కేంద్ర వైద్య బృందం
కాగా.. మంగళవారం నాడు కేంద్రం వైద్య బృందాన్ని అత్యవసరంగా పంపుతోంది. రేపు ప్రజల ఆకస్మిక అనారోగ్యంపై ఈ బృందం విచారణ చేయనున్నది. ఈ బృందంలో డాక్టర్ జంషెడ్ నాయర్.. అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ అవినాష్ డియోష్టవర్.. వైరాలజిస్ట్, డాక్టర్ సంకేత్ కులకర్ణి వీరంతా.. రేపు సాయంత్రం నాటికి ప్రాథమిక నివేదికను సమర్పించాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (పిహెచ్ డివిజన్) నుంచి ఈ బృందానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
 
ఇప్పటికే ఏలూరుకు వెళ్లిన మంగళగిరి ఎయిమ్స్‌ వైద్యుల బృందం రోగుల నుంచి రక్త నమూనాలు సేకరించింది. అయితే బాధితుల్లో ఎక్కువ మంది ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారేనని, వారికి ఎలాంటి ఇన్ఫెక్షన్‌ లేదని ఎయిమ్స్‌ వైద్యులు తెలిపారు. రక్త నమూనాలు సేకరించి ఢిల్లీ ఎయిమ్స్‌కు పంపించామని, రిపోర్టుల ఆధారంగా వ్యాధిని నిర్థారిస్తామని ఎయిమ్స్‌ వైద్యులు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ బంద్ పాటించే సమయం ఎంతంటే?