సముద్ర ప్రయాణాన్ని ఎంజాయ్ చేయాలని భావించే పర్యాటకుల కోసం శుభవార్త. చెన్నై, విశాఖపట్టణం, పుదుచ్చేరిల మధ్య జూన్, జూలై నెలలో క్రూయిజ్ నౌక సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు విశాఖలో బుధవారం నిర్వహించిన ట్రావెల్ ఏజెంట్ల సమావేశంలో నిర్వాహకులు కార్డెల్లా క్రూయిజ్ నౌక ప్రయాణ వివరాలను వెల్లడించారు.
మూడు సర్వీసుల్లో భాగంగా తొలిసారి జూన్ 30వ తేదీన చెన్నైలో బయలుదేరి జూన్ 2వ తేదీన విశాఖ హార్బరుకు చేరుకుంటుంది. అదే రోజు అక్కడ నుంచి బయలుదేరి 4వ తేదీన పుదుచ్చేరికి వెళుతుంది. 4వ తేదీన పుదుచ్చేరిలో బయలుదేరి 5వ తేదీన చెన్నైకు వస్తుంది. రెండో సర్వీసుగా జూలై 7వ తేదీన చెన్నైలో బయలుదేరి 9వ తేదీన విశాఖకు, 11వ తేదీన పుదుచ్చేరి అక్కడ నుంచి 12వ తేదీన చెన్నైకు చేరుకుంటుంది.
మూడో సర్వీసుగా జూలై 14వ తేదీన చెన్నై హార్బరులో బయలుదేరి 16వ తేదీన విశాఖకు, అక్కడ నుంచి 18వ తేదీన పుదుచ్చేరి చేరుకుని 19వ తేదీన చెన్నైకి చేరుతుంది. అతిపెద్ద క్రూయిజ్ నౌకలో ప్రయాణం చేసేందుకు అనేక మంది పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. గతంలో విశాఖ తీరానికి చేరుకున్న క్రూయిజ్ నౌకలను చూసేందుకు పర్యాటకు భారీ సంఖ్యలో తరలివచ్చిన విషయం తెల్సిందే.