Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 30 April 2025
webdunia

అలనాటి నటి పుష్పలత కన్నుమూత..

Advertiesment
pushpalatha

ఠాగూర్

, బుధవారం, 5 ఫిబ్రవరి 2025 (11:19 IST)
అలనాటి నటి పుష్పలత కన్నుమూశారు. ఆమెకు వయసు 87 సంవత్సరాలు. వయోభారం కారణంగా శ్వాసపీల్చడంలో సమస్యలు తలెత్తడంతో చెన్నై నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆమె మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్టు ఆమె భర్త, సినీ నటుడు ఏవీఎం రాజన్ వెల్లడించారు. చెన్నై టీ నగర్‌లోని తిరుమలపిళ్లై రోడ్డులో ఆమె పార్థివదేహాన్ని అభిమానులు, కుటుంబ సభ్యుల సందర్శనకు ఉంచారు. 
 
1958లో వచ్చిన 'సెంగోట్టై సింగం' అనే చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమె 1961లో 'కొంగునాట్టు తంగం' అనే చిత్రంతో హీరోయిన్‌గా అరంగేట్రం చేశారు. ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేశన్, ఎంఎస్ రాజేంద్ర‌న్ వంటి అగ్ర నటుల సరసన నటించారు. 'నానుమ్ ఒరు పెణ్ అనే చిత్రంలో నటుడు ఏవీఎం రాజన్‌తో కలిసి నటించారు. ఆ తర్వాత ఆయనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. వీరిలో ఆమె కుమార్తె మహాలక్ష్మి కూడా ఓ సినీ నటే. 
 
పుష్పలత తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వందకుపైగా చిత్రాల్లో నటించారు. తెలుగులో 'పెద్దకొడుకు', 'మేము మనుషులమే', 'అన్నదమ్ముల అనుబంధం', 'యుగపురుషుడు', 'శ్రీరామ పట్టాభిషేకం', 'వేటగాడు', 'రాధా 'కళ్యాణం', 'కొండవీటి సింహం' చిత్రాల్లో నటించారు. ఏవీఎం సంస్థ నిర్మించిన 'రాము' చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించారు.
 
1963లో 'మైన్ భీ లక్కీ హూన్' అనే హిందీ చిత్రంలో, 'నర్స్' అనే మలయాళ చిత్రంలోనూ నటించారు. 'సకలకళా వల్లభన్', 'నాన్ అడిమై ఇలై' వంటి చిత్రాల్లో సహాయ నటిగా నటించారు. ఆమె చివరగా మురళి హీరోగా నటించిన 'పూవాసమ్'(1999) అనే తమిళ చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత ఆమె సినిమాల వైపు తిరిగి చూడలేదు. 
 
ఆమె మృతిపై పలువురు తమిళ సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలిపారు. కాగా, పుష్పలత కుమార్తె మహాలక్ష్మి 'రెండు జెళ్ల సీత', 'ఆనంద భైరవి', 'మాయదారి మరిది', 'రుణానుబంధం' చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!