జోన్‌లో రైలు పట్టాల నిర్వహణ పనులను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు రైలు పట్టాల భద్రతకు భరోసా కల్పించేందుకు రూపొందించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ఉన్నతాధికారులకు సూచించారు.
సికింద్రాబాద్ రైల్ నిలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భద్రత, సరకు రవాణా మరియు సమయపాలనపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు మేనేజర్ బి.బి.సింగ్, జోన్ ఉన్నతాధికారులు, 6 డివిజన్ల (సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్) నుంచి డిఆర్ఎంలు పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా తొలుత భద్రత చర్యలను సమగ్రంగా సమీక్షిస్తూ గజానన్ మాల్య స్టేషన్ యార్డులు మరియు రైల్వే సైడింగ్ ప్రాంగణాల్లో భద్రతకు భరోసా కల్పించే చర్యలను చేపట్టాలన్నారు. జోన్‌లో రైలు పట్టాల నిర్వహణ పనులను సమీక్షించారు.
రైలు పట్టాల భద్రతకు భరోసా కల్పించేందుకు ఏర్పాటు చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, రైళ్ళ రాకపోకల్లో తలెత్తే సమస్యలను సాధ్యమైనంత తొందరగా సవరణ చర్యలను చేపట్టాలని అధికారులకు సూచించారు. అలాగే అవసరమైనచోట్ల కాషన్ ఆర్డర్లను తొలగించాలని తద్వారా ళ్ళ రాకపోకల వేగం పెరిగే అవకాశముందన్నారు.
డివిజనల్ రైల్వే మేనేజర్‌లు అందరితో బిజినెస్ డెవలప్‌మెంట్ యూనిట్ల నిర్వహణపై కూడా ఆయన సమీక్షించారు. సరకు రవాణా అభివృద్ధికి వినియోగదారులతో నిరంతరంగా సంప్రదింపులు జరుపుతూ ఉండాలని స్పష్టం చేశారు. ఆహార ధాన్యాలు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు మరియు గ్రానైట్ తదితర అంశాలకు సంబంధించి లోడింగ్‌పై రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలను కూడా ఆయన సమీక్షించారు.
వినియోగదారులు మరియు వ్యాపారులకు సాధ్యమైనంత మద్దతు ఇస్తుందనే విషయం తెలియజేయాలని అధికారులకు సూచించారు. సరకు రవాణా మెరుగుదల కోసం మరియు రైల్వే కల్పించిన నూతన చొరవను గురించి వారికి వివరిస్తూ సంస్థ ప్రయోజనం కోసం తోడ్పడాలని అధికారులకు పేర్కొన్నారు.
ఉద్యోగుల సంక్షేమం గురించి మాట్లాడుతూ డివిజనల్ ఆఫీసులు మరియు వర్క్‌షాప్‌లు తదితర కార్యాలయాల్లో కరోనా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసి వారిలో విశ్వాసాన్ని పెంచాలని గజానన్ మాల్య సూచించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి జోన్‌లోని శిక్షణా సంస్థలతో పాటు అన్నిచోట్ల జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.