దొంగలను పట్టుకుని పోలీసులు తమ ఠాణాల్లో పెడతారు. కానీ, విచిత్రంగా ఠాణాల్లోనే దొంగతనాలు ఇటీవల పెరిగిపోయాయి. మొన్ననీ మధ్య ఒక పోలీస్ స్టేషన్లో రికవరీ సొమ్ము గల్లంతు అయింది. ఇపుడు తాజాగా కృష్ణా జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్లో 7 లక్షల రూపాయలు మాయం అయ్యాయి.
కృష్ణా జిల్లా నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్లో ఐదు రోజుల క్రితం 7 లక్షల రూపాయలు మాయం అయ్యాయి. ప్రతి ఆదివారం మద్యం దుకాణాలలో వసూలయిన సొమ్మును పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేస్తారు. ఆ రోజు బ్యాంకులకు సెలవు కావడంతో స్టేషన్లో డబ్బు ఉంచి, సోమవారం ఉదయం వచ్చి బ్యాంకులో కట్టేస్తారు. ఇలాగే నూజివీడు స్టేషన్ లో డిపాజిట్ చేసిన సొమ్ము కనపడకుండా పోయింది.
అదే సొమ్మును భద్రపరచాల్సిన రైటర్, కానిస్టేబుల్ జనార్ధన నాయుడు కూడా కనపడకుండా గైర్హాజరయ్యాడు. దీనితో అతనిపై అనుమానం వచ్చి, పోలీసులు అంతర్గత విచారణ ప్రారంభించారు. తను ఇంట్లో కూడా కనపడకపోవడంతో, ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు పరారైన కానిస్టేబుల్ జనార్దన్ నాయుడి కోసం వెతుకులాట ప్రారంబించారు. చివరికి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.
సాంకేతిక పరిజ్ఞానంతో జనార్దన్ నాయుడు కన్యాకుమారి లో ఉన్నట్లు గుర్తించి, అక్కడికి వెళ్లి, అతన్ని అదుపులోకి తీసుకుని నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్ కి తీసుకురానున్నారు.