మోడీ అంతగా పగలబడి నవ్వారంటే మీ పని అయిపోయినట్టే : వెంకయ్య వ్యాఖ్యల్లో అర్థమేంటి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేటాయించే అంశంపై హస్తిన రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఓటింగ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేటాయించే అంశంపై హస్తిన రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఓటింగ్ జరుగకుండా అధికార ఎన్డీయే పక్షం అడ్డుకుంది. ఇది ద్రవ్య బిల్లు అని, దీనిపై ఓటింగ్ జరగాలా వద్దా అనేది లోక్‌సభ స్పీకర్ మాత్రమే నిర్వహిస్తారంటూ రాజ్యసభ ఉపసభాపతి పీజే కురియన్ ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత బీజేపీ మిత్రపక్షమైన టీడీపీకి చెందిన ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఆ సమయంలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ చేసిన మంత్రపఠనంతో ప్రధాని మోడీ పగలబడి నవ్వారు.
ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి వెంకయ్య టీడీపీ నేతలతో మాట్లాడుతూ మోడీ అంతగా పగలబడి నవ్వారంటే మీ పని అయిపోయినట్లేనని, ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేసినట్లేనని కూడా ఆయన చెప్పారట. మరోవైపు హస్తినలో జరిగిన పలు పరిణామాలను పరిశీలిస్తే... ఏపీకి ప్రత్యే హోదా కోసం కేంద్రం నుంచి కొంత మేర సానుకూలత వ్యక్తమైనట్లు తెలుస్తోంది.
అదేసమయంలో కాంగ్రెస్ పార్టీ తీరును మరోమారు మంత్రి వెంకయ్య ఎండగట్టారు. ప్రత్యేక హోదాపై ప్రశ్నించే హక్కు కాంగ్రెస్‌కు లేదని, కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని బిల్లులో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. హోదా విషయంలో మన్మోహన్, రాహుల్ గాంధీ మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీకి తప్పకుండా న్యాయం చేస్తామని ప్రధాని మోడీ చెప్పారని, ఏపీని ఆదుకుంటామని రాజ్యసభలో అరుణ్ జైట్లీ అన్నారని వెంకయ్య గుర్తు చేశారు.