Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాకీలకే టోకరా : బండోకరిది.. బాదుడొకరిది.. కేటుగాళ్ల మాయాజాలం

Advertiesment
కాకీలకే టోకరా : బండోకరిది.. బాదుడొకరిది.. కేటుగాళ్ల మాయాజాలం
, బుధవారం, 20 జనవరి 2021 (17:09 IST)
ఏపీ28బిటి 4041. ఇది ఇక్కడ పార్క్‌ చేసి ఉన్న హోండా యాక్టివా టూవీలర్‌ నెంబర్‌. 2012 మోడల్‌ అయిన ఈ బండిని 2014లో ఖమ్మం నగరానికి చెందిన మారెడ్డి సీత అనే మహిళ స్థానికంగా ఉన్న ఓ ఫైనాన్స్‌ కంపెనీ నుంచి ఈ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ బండిపై ఖమ్మం దాటి వెళ్లింది లేదు. 
 
కానీ ఈ మధ్య కాలంలో ఈ బండి ఓనర్‌కు చలాన్లమీద చలాన్లు వస్తున్నాయి. సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలలోని ఎల్బీ నగర్‌, ఆల్వాల్‌లలో ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడినట్టు పేర్కొంటూ బండి ఫొటోతో సహా చలాన్లను పోస్టులో ఇంటికి పంపారు. దీంతో ఖంగుతిన్న బండి యజమాని భర్త నాగేందర్‌రెడ్డి తనకున్న పూర్వ పరిచయంతో రాచకొండ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ విచారణ జరిపించారు.
 
అదే నెంబరుతో మరో ద్విచక్ర వాహనం తిరుగుతున్నట్టు తేల్చారు. అదెలా..? 
అంటే అదో పెద్ద ప్రశ్న ఈ మధ్య కాలంలో ఇదో ప్రాక్టీస్‌గా మారిందన్నది పోలీసుల పరిశీలన కూడా.. ఏదో రాంగ్‌ పార్కింగో హెల్మెట్‌ లేదనో ఐదొందలో వెయ్యో ఫైన్‌ వేస్తే ఓకే ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పరిస్థితి ఏంటన్నదే ప్రశ్న. భయం కూడా ఇలా ఒకటి కాదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ మధ్య కాలంలో తాము తిరగని ప్రాంతాలలో తిరిగినట్టు ఎన్నడూ వెళ్లని రూట్లో వెళ్తూ.. ఉల్లంఘనలకు పాల్పడినట్టు పెనాల్టీలు కట్టాలంటూ నోటీసులు అందుతున్న దాఖలాలు ఎన్నో.
 
వినే నాథుడేడి..? 
బాధితులు లబోదిబోమంటూ మొత్తుకుంటున్నా వినేనాథుడు లేడు. ఇదో చిత్రమైన బాధ. ఇలా భద్రాచలం పట్టణానికి చెందిన ఓ కారు నెంబరుతో.. టేకులపల్లి పోలీసుస్టేషన్‌ లిమిట్స్‌లో ఆటో తిరుగుతోంది. సదరు ఆటో డ్రైవర్‌ పాల్పడిన ట్రాఫిక్‌ అతిక్రమణలన్నీ భద్రాచలంలో ఉన్న కారు ఓనర్‌కు నోటీసుల రూపంలో వెళ్తున్నాయి. తాను తిరగని ప్రాంతాలలో తిరిగినట్టు.. అదీ ట్రాఫిక్‌ అతిక్రమణలకు పాల్పడినట్టు నోటీసులు రావడంతో తల పట్టుకోవడం ఆ కారు ఓనర్‌ వంతయింది.
 
ఖమ్మంలో ఉన్న బండికి హైదరాబాద్ లో ట్రాఫిక్ చలాన్...
నోపార్కింగ్‌ జోన్‌లో వాహనం పార్క్‌ చేయడం రాంగ్‌ రూట్‌లో వెళ్లడం ఓవర్‌ స్పీడ్‌ రెడ్‌ సిగ్నల్‌ క్రాసింగ్‌ హెల్మెట్‌ లేకుండా డ్రైవ్‌ చేయడం..ఈ మధ్య కాలంలో మాస్క్‌ లేకుండా బండి నడపడం ఇలా ఉల్లంఘన ఏదైనా ఫైన్‌ మామూలే.
ఒక్కో ఉల్లంఘనకు ఒక్కో రకమైన ఫైన్‌ తప్పు చేసిన వారికి ఫైన్‌ వేయాల్సిందే. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. మళ్లీ మళ్లీ తప్పు చేయకుండా గట్టిగా చర్యలు తీసుకోవాల్సిందే. దీన్లో ఎలాంటి శషబిషలు లేవు. వేరే చర్చకు తావేలేదు. కానీ వాహన యజమానులకు సంబంధం లేకుండా ఇవి జరుగుతుంటేనే బాధ పడాల్సిన పరిస్థితి వస్తుందన్నది బాధితుల మాట.
 
అక్కడితో ఆగకుండా... 
ఇది ఫైన్‌ల చెల్లింపులకు పరిమితం కావడం లేదు. ఈ మధ్య కాలంలో నగరాలు, పట్టణాలు దాటి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించిన చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడే ముఠాలు ముందుగానే తాము వినియోగించే వాహనాలకు నెంబర్లు మారుస్తున్నారు. దీంతో బాటు గుట్కాలు, గంజాయి రవాణాకు ఉపయోగించే వాహనాలకు సైతం నెంబర్లు మారుస్తున్న ఉదంతాలను చూస్తున్నాం. కొద్ది రోజుల క్రితం ఓ ఆస్తి వివాదంలో సాక్షాత్తూ సీఎం కేసీఆర్‌ సమీప బంధువులను కిడ్నాప్‌ చేసిన ఘటనలోనూ నిందితులు తాము ఉపయోగించిన వాహనాలకు నెంబర్లు మార్చివేశారు. ఇలాంటి సీరియస్‌ అఫెన్స్‌లలో ఒక్కోసారి అమాయకులు చిక్కుకుంటున్న దుస్థితి ఉత్పన్నమవుతోంది. సమగ్ర విచారణ అనంతరం అమాయకులంటూ తేలినా.. ఎలాంటి తప్పు చేయకుండా అప్పటిదాకా పోలీసుస్టేషన్ల చుట్టూ తిరగడం ఎవరికైనా తీవ్ర మనోవేదనకు గురిచేస్తుంది.
 
ట్రాఫిక్‌ కెమెరాలతో చిక్కు.. 
గత కొన్నేళ్లుగా ట్రాఫిక్‌ ఉల్లంఘనలను సాక్ష్యాలతో పట్టుకోవడానికి డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లకు కెమెరాలను ఇచ్చారు. కూడళ్లలో ఉంటూ అతిక్రమణలకు పాల్పడిన వాహనాలను ఫోటోలు తీయడం కంట్రోల్‌ రూంనకు పంపడం అక్కడ ఉన్న వాళ్లు ఆర్టీఏ వెబ్‌సైట్‌ ద్వారా ఓనర్‌ వివరాలు తీసుకుని నోటీసు ముద్రించి పోస్ట్‌ చేయడం జరుగుతున్న ప్రక్రియ. కానీ వేరే నెంబర్లతో తిరుగుతున్న వాహనాలను గుర్తించడం ఎలా ఆపి చెక్‌ చేసి చూడాలి. రద్దీ దృష్ట్యా అది అంత సులభమైన విషయం కాదు. దీంతోపాటు ఫోటోలో నెంబరు సీరీస్‌ సరిగా కనిపించకపోవడం లేదా నెంబరు వేసే విధానంలో ఫ్యాన్సీ పోకడల వల్ల కన్ఫ్యూజన్‌ తలెత్తుతోంది. ఒకరిది ఒకరికి పోవడం కొన్నిసార్లు ట్రాఫిక్‌ వలయాల్లో అమర్చిన కెమెరాల్లోని పిక్చర్‌ ఆధారంగా చలాన్లు పంపడం వల్ల కూడా దీనికి కారణమవుతోంది. కారణం ఏదైనా చేయని తప్పులకు ఫైన్లు కట్టాల్సి రావడం ఒక బాధ అయితే.. ఏదైనా అసాంఘిక కార్యకలాపాలతో స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తే ఆ బాధ చెప్పలేనిది. ఈ విషయంలో ఉన్నతాధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితులు వేడుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జో బైడెన్ ప్రమాణ స్వీకారం : భద్రతా వలయంలో శ్వేతసౌధం (ఫోటో ఫీచర్)