రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. అయితే సీఐడీ నోటీసులపై బుధవారం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యే అవకాశం ఉంది. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని చంద్రబాబు పిటిషన్‌ను వేయనున్నారు.
కాగా, చంద్రబాబు విషయంలో జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అమరావతి భూముల అక్రమాల కేసులో మంగళవారం నాడు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు చేరుకుని ఈ నోటీసులను అందజేశారు.
అమరావతి రాజధాని భూముల అక్రమాలపై చంద్రబాబుకు నోటీసులిచ్చేందుకు.. ఉదయమే హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు ఏపీ సీఐడీ అధికారులు. విచారణకు హాజరుకావలసిందిగా నోటీసులు జారీ చేశారు.
చంద్రబాబుపై 120బి, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. అలాగే చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు కూడా 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు సీఐడీ అధికారులు.