ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఏకగ్రీవంగా ఓ తీర్మానం చేసింది. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ ఓ ప్రకటన చేసింది. అమరావతిలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, సీఎంవోలతో పాటు... అన్ని శాఖల ప్రధాన కార్యాలయాలు ఉండాలని ఆ తీర్మానంలో పేర్కొంది. అదేసమయంలో రాజధాని తరలింపును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్న అమరావతి ప్రాంత రైతులకు అండగా నిలబడుతూ తాము కూడా ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని బీజేపీ నేతలు నిర్ణయించారు.
కాగా, అమరావతి రైతులకు ఇప్పటికే విపక్ష తెలుగుదేశం పార్టీతోపాటు సినీ నటుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ, ఇతర పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అలాగే, రైతులతో కలిసి ఉద్యమిస్తున్నాయి. ఒక్క అధికార వైకాపా మాత్రం రైతు ఉద్యమానికి దూరంగా ఉంది. పైగా, రైతుల ఉద్యమాన్ని నీరుగార్చేలా, కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో అమరావతే రాజధాని అంటూ బీజేపీ ఏకగ్రీవ తీర్మానం చేయడం ఇపుడు రైతులకు మరింత బలం చేకూరినట్టయింది.