Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కూలిన వందేళ్ల మర్రి మాను... పున‌:ప్రాణం పోసిన స్థానికులు

కూలిన వందేళ్ల మర్రి మాను... పున‌:ప్రాణం పోసిన స్థానికులు
విజయవాడ , శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (15:23 IST)
మ‌చిలీప‌ట్నం ఎల్ఐసీ ఆఫీసు ముందు ఓ పెద్ద మర్రి చెట్టు. దాని నీడన ఎంతో మంది చిరు వ్యాపారులు బండ్లు పెట్టుకొని వ్యాపారాలు చేసుకునే వారు. ఎండా కాలంలో చాలా మంది చెట్టు కింద సేదతీరేవారు. దశాబ్దాల తరబడి ఎన్నో పక్షులకు ఆ చెట్టు ఆశ్రయాన్ని ఇచ్చింది. అలాంటి చెట్టు ఉన్నట్టుండి నేలకూలింది. గతంలో ఎన్నో తుఫాన్లు, బలమైన గాలులకు ఎదురొడ్డి నిలబడిన ఆ చెట్టు అకస్మాత్తుగా కూలిపోయింది.

మిగతా వాళ్లకు అది ఓ చెట్టు మాత్రమే కావచ్చు కానీ, ఆ ప్రాంతం అనుబంధం ఉన్న వాళ్లకు అదో ఆత్మీయ నేస్తం. పెనుగాలులకు తట్టుకొని నిలబడిన ఆ మహావృక్షం. నేలకు ఒరగడం వారిని కలచి వేసింది. బోలెడంత మంది చిరు వ్యాపారులకు, లెక్కలేనన్ని పక్షులకు ఆశ్రయం కల్పించిన ఆ చెట్టును ఎలాగైనా బతికించాలని స్థానికులు సంకల్పించారు. 
 
విజయవాడలో ఇలాగే ఓ చెట్టు కూలిపోతే, ట్రాన్‌లొకేట్ చేసి దాన్ని మళ్లీ చిగురింపజేసిన విషయం వారికి గుర్తొచ్చింది. దీంతో కూలిపోయిన చెట్లను ట్రాన్స్‌లొకేట్ చేసే వారి కోసం ఇంటర్నెట్‌లో వెతికి, హైదరాబాద్‌లోని ‘వట ఫౌండేషన్’ ఉదయ్ కృష్ణకు ఫోన్ చేశారు. వెంటనే స్పందించిన ఉదయ్ కృష్ణ, హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వెళ్లి ఆ చెట్టును ట్రాన్స్‌లొకేట్ చేశారు. ఈ క్రమంలో దాని కొమ్మలను కత్తిరించి, ఆరడగుల లోతైన గోతిలో నిలబెట్టారు.వాస్తవానికి ఈ మర్రి చెట్టు మరో చెట్టుపై మొలిచింది. ఏ పక్షో మర్రి పండును తిని విసర్జించాక, చెట్టుపై మొక్కగా మొలకెత్తి, ఇంతింతై వటుండితయై.. అన్నట్టుగా మహావృక్షంగా ఎదిగింది. 
 
అసలు చెట్టు కంటే ఇదే పెద్దదిగా మారింది. కాలక్రమంలో కరెంట్ తీగలకు తాకుతుందనే కారణంతో నేలపై ఆధారంగా ఉన్న చెట్టు కొమ్మలను కత్తిరించారు. దీంతో అది బలహీనపడి, మర్రి చెట్టు భారాన్ని మోయలేకపోయింది. ఫలితంగా రెండు చెట్లూ కూలిపోయాయి. ఈసారి మర్రి చెట్టు భారం మొదటి వృక్షంపై పడకుండాదాని వేర్లు సైతం నేలలోకి చొచ్చకొని వెళ్లేలా లోతైన గోతిలో నిలబెట్టామని ఉదయ్ ‘సమయం’కు తెలిపారు. మరో 15 రోజుల్లో ఈ చెట్టు చిగురించనుంది. 
 
కానీ ఏడాదిపాటు ఈ చెట్టును నిరంతరం పరిశీలించాల్సి ఉంటుంది. దాని వేళ్లు తిరిగి బలం పుంజుకునేంత వరకు.. తరచుగా నీరు పెట్టాల్సి ఉంటుంది. ఇన్నాళ్లూ తమకు నీడనిచ్చి సేదతీర్చిన ఈ మహావృక్షాన్ని స్థానికులు ఇప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుల్లెట్ బండి పాటతో పక్షవాతానికి చికిత్స.. వైరల్ వీడియో