Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైఎస్ రాజారెడ్డి.. ఉత్తమోత్తమైన వ్యక్తి : భూమన కరుణాకర్ రెడ్డి

Advertiesment
Bhumana Karunakar Reddy
, సోమవారం, 27 జనవరి 2020 (15:27 IST)
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తండ్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తాత అయిన వైఎస్ రాజారెడ్డిపై వైకాపా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. వైఎస్ రాజారెడ్డి ఉత్తమోత్తమైన వ్యక్తి అని చెప్పారు. సీఎం జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ఆయన తాత రాజారెడ్డి గురించి ప్రతిపక్ష సభ్యులు ప్రస్తావిస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
అసెంబ్లీలో ఏపీ శాసనమండలి రద్దు బిల్లుపై జరుగిన చర్చలో భాగంగా భూమన మాట్లాడుతూ, 'రాజారెడ్డి లాంటి ఉత్తమోత్తమమైన వ్యక్తి చాలా అరుదుగా రాజకీయాల్లో ఉంటారు. ఆయనతో ఇరవై మూడు సంవత్సరాలు ఏ ఒక్కరూ లేనంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తిగా చెబుతున్నాను. కమ్యూనిస్టు నాయకుడు, నిజాయతీగా నాలుగు పర్యాయాలు ఎంపీగా గెలిచిన ఎద్దుల ఈశ్వరరెడ్డికి పులివెందుల నుంచి ఏజెంట్‌గా 1977 వరకు రాజారెడ్డి ఉన్నారు. కమ్యూనిస్టు నాయకుడు, ప్రముఖ పాత్రికేయుడు, గొప్ప దార్శనికుడు గజ్జెల మల్లారెడ్డికి అత్యంత ప్రాణసఖుడు రాజారెడ్డి. ఇలాంటి గొప్ప వ్యక్తిని గురించి నీచంగా మాట్లాడటం చంద్రబాబునాయుడుకే తగింది' అంటూ విమర్శలు గుప్పించారు. 
 
అలాగే, టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీ సీఎం జగన్ ప్రజాక్షేమం కోసం పనిచేస్తుంటే చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రతిదానికి అడ్డుపడుతున్నారని ఆగ్రహించారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు చికాకు పెడుతున్నారని, విశ్వామిత్రుడి అనుయాయి నక్షత్రకుడు ఏ విధంగానైతే సత్యహరిశ్చంద్రుడ్ని పీడిస్తుంటాడో చంద్రబాబు కూడా అదేవిధంగా జగన్‌ను పీడిస్తున్నారని ఆరోపించారు.
 
అంతకుముందు ఆయన మహాభారతంలోని జయద్రథుడి గురించి ప్రస్తావించారు. సైంధవ రాజ్య యువరాజు కావడంతో జయద్రథుడ్ని సైంధవుడు అని కూడా అంటారని, ఇప్పుడు టీడీపీ సభ్యులు కూడా సైంధవుల్లా తయారయ్యారని విమర్శించారు. నాడు సైంధవుడ్ని కౌరవులు పురికొల్పినట్టుగా, నేడు చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్సీలను బిల్లులు అడ్డుకునేందుకు ఉసిగొల్పుతున్నారంటూ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బలిసిన కోడి చికెన్ షాపు ముందు తొడ కొట్టినట్లుంది లోకేష్ తీరు: ఎమ్మెల్యే రోజా ఘాటు వ్యాఖ్యలు