అసలే కోవిడ్ కాలం... ఈ ఏడాది భవానీ దీక్షా దారులు అత్యథిక సంఖ్యలో ఇంద్రకీలాద్రికి పోటెత్తితే, అది ప్రమాదానికి దారితీస్తుంది. కరోనా మహమ్మారిని విస్తరింప జేస్తుంది. అందుకే బెజవాడ కనక దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అలర్ట్ అయంది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అత్యవసర సమావేశాన్ని గురు భవానీలతో ఏర్పాటు చేసింది.
విజయవాడ దుర్గ గుడిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో భవానీ దీక్షా విరమణలకు భారీగా భక్తులు ఎర్రని వస్త్రాలను ధరించి ఇంద్రకీలాద్రికి వస్తారు. ఇంద్రకీలాద్రిపై 07.10.2021 నుండి 15.10.2021 వరకు జరిగే దసరా శరన్నవ రాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కోవిడ్-19 సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చిన నిభందనలను అనుసరించి అంతా నడుచుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
విజయవాడ, కృష్ణా జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, గుంటూరు జిల్లా, తెలంగాణా, కర్ణాటక, చిత్తూరు జిల్లా, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాల నుండి, ఇతర రాష్ట్రముల నుండి వచ్చిన గురు భవానీలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మల్లిఖార్జున మహామండపం 6వ అంతస్తులో సమావేశమై, కోవిడ్ నిబంధనలను వివరించారు.
గురు భవానీలు అమ్మవారి దర్శనార్ధం కోసం వచ్చే భవానీ భక్తులకు దేవస్థానము వారి తరపున చేయవలసిన ఏర్పాట్లు గురించి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మెన్ పైలా సోమినాయుడు, కార్య నిర్వహణాధికారి డి.భ్రమరాంబ చర్చించారు. భవానీల తరపున గురు భవానీ ఈది ఎల్లారావు పాల్గొన్నారు.