ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టులో స్పల్ప ఊరట లభించింది. బాబ్లీ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించింది. బాబ్లీపై పొరాటం కేసులో చంద్రబాబుపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను రద్దు చేయాలంటూ న్యాయవాదులు చేసిన రీకాల్ పిటిషన్ పైన కోర్టులో వాదనలు జరిగాయి. సుమారు గంటన్నర పాటు ఈ వాదనలు జరిగాయి.
అనంతరం.. ఈ నెల 15వ తేదీన వ్యక్తిగత హాజరు నుంచి చంద్రబాబుకు మినహాయింపు ఇస్తున్నట్టు కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే… నవంబర్ 3వ తేదీన చంద్రబాబు హాజరు కావాలని సూచించింది. సీఎం కావడంతో వ్యక్తిగతంగా హాజరు కావడం సాధ్యం కాదని బాబు తరుపు న్యాయవాది చెప్పారు. కేసు పూర్తయ్యే వరకు మినహాయింపు ఇవ్వాలని చంద్రబాబు కోరినట్టు సమాచారం.
బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు పోరాటం చేసారు. ఎనిమిదేళ్ల అనంతరం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం జరిగింది. చంద్రబాబు తరుపు న్యాయవాది రీకాల్ పిటిషన్ వేసారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడంతో బాబుకు ఊరట లభించింది.