తెలంగాణలో రోజురోజుకు రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ సవాల్ చేసుకోవడాలు.. సమాధానం చెప్పాలంటూ బహిరంగ లేఖ రాయడాలు చేస్తున్నారు. విషయం ఏంటంటే.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాసారు.
ఈ లేఖలో పేర్కొన్న 12 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరుతున్నాను అన్నారు. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పొత్తులు పెట్టుకుందని.. చంద్రబాబుపై ఆధారపడి ఉండే ప్రభుత్వం తెలంగాణలో ఉంటే ఇక్కడి ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నారు. చంద్రబాబు ఎప్పటికైనా ఆంధ్రాబాబే. చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీది షరతులతో కూడిన పొత్తా..? లేక భేషరతు పొత్తా..? అని ప్రశ్నించారు.
తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్‌కు లేఖ ఇచ్చాకే తెరాస పొత్తు పెట్టుకుంది. ఆనాడు మా పొత్తు షరతులతో కూడిన పొత్తు. మీ పొత్తులపై ప్రజలకు సమాధానం చెప్పాలి. తెలంగాణ రాకుండా చివరి నిమిషం వరకు చంద్రబాబు అడ్డుపడ్డారు. చంద్రబాబు ఏమైనా తీర్మానం చేసి ఉంటే ఆ కాగితాన్ని ప్రజల ముందు పెట్టండి అని చెప్పారు. తెలంగాణ వ్యతిరేక వైఖరిని విడనాడుతానని చంద్రబాబు వద్ద ఏమైనా మాట తీసుకున్నారా..? పోలవరం డిజైన్ మార్చడానికి చంద్రబాబు వైఖరి ఏంటి..? 7 మండలాలను తిరిగి తెలంగాణలో కలుపుతానని కాంగ్రెస్ ఒప్పందం కుదుర్చుకుందా..? అని అడిగారు.
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై చంద్రబాబు 30 లేఖలు రాసారు. పాలమూరు ప్రాజెక్ట్ సక్రమమైనదేనని… ప్రాజెక్టులపై ఎలాంటి అభ్యంతరం లేదని చంద్రబాబు మీకేమైనా లేఖ ఇచ్చారా..? అని ప్రశ్నించారు. మరి.. హరీష్ రావు లేఖకు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తారో లేదో చూడాలి.