Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

25 నుంచి నెల్లూరు - తిరుపతి నుంచి చెన్నైకు ఆర్టీసీ బస్సులు

25 నుంచి నెల్లూరు - తిరుపతి నుంచి చెన్నైకు ఆర్టీసీ బస్సులు
, మంగళవారం, 24 నవంబరు 2020 (17:48 IST)
ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సేవలను తిరిగి ప్రారంభంకానున్నాయి. కరోనా లాక్డౌన్ తర్వాత అంటే.. ఎనిమిది నెలల తర్వాత ఈ సేవలు పునఃప్రారంభంకానున్నాయి. 
 
నిజానికి కరోనా లాక్డౌన్ తర్వాత అంతర్రాష్ట్ర ప్రయాణాలకు కేంద్రం ఎప్పుడో పచ్చజెండా ఊపినా ఏపీలో మాత్రం ఇప్పుడిప్పుడే బస్సులు పొరుగు రాష్ట్రాల బాట పడుతున్నాయి. కొన్నిరోజుల కిందట తెలంగాణకు బస్సులు పునఃప్రారంభించిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బుధవారం నుంచి చెన్నైకి కూడా బస్సులు తిప్పేందుకు సన్నద్ధమైంది.
 
విజయవాడతో పాటు తిరుపతి, గూడూరు తదితర ప్రాంతాల నుంచి తమిళనాడుకు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. చెన్నైకి ఏపీ నుంచి మళ్లీ బస్సులు తిరగడం 8 నెలల తర్వాత ఇదే ప్రథమం. చెన్నై ప్రయాణం కోసం ఏపీఎస్ ఆర్టీసీ ఆన్‌లైన్‌లోనూ టికెట్లు ఉంచింది. రాబోయే రోజుల్లో డిమాండ్‌కు అనుగుణంగా చెన్నైకి మరిన్ని బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసి అధికారులు భావిస్తున్నారు.
 
అలాగే, చిత్తూరు జిల్లాలోని తిరుపతితో పాటు ఇతర ప్రాంతాల నుంచి తమిళనాడుకు బుధవారం నుంచి ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు చిత్తూరు రెండో డిపో మేనేజర్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు. తొలి దశలో 41 సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. చిత్తూరు రెండో డిపో నుంచి 15, ఒకటో డిపో నుంచి నాలుగు, తిరుమల డిపో నుంచి 22 సర్వీసులను నడుతున్నట్లు పేర్కొన్నారు. 
 
ఇందులో చిత్తూరు రెండో డిపో నుంచి వేలూరుకు నాన్‌స్టాప్‌-8, తిరుత్తణికి-1, తిరుమల నుంచి తిరువణ్ణామలైకి-6 సర్వీసులు నడుస్తాయన్నారు.  చిత్తూరు ఒకటో డిపోకి చెందిన రెండు సర్వీసులు తిరుపతి, వేలూరు మధ్య, మరో సర్వీసు పేర్నంబట్టుకు, ఇంకోటి గుడియాత్తానికి నడుస్తుందన్నారు. తిరుమల, వేలూరు మధ్య 22 సర్వీసులు నడుస్తాయని వివరించారు. ఈ సర్వీసులన్నీ బుధవారం తెల్లవారుజాము నుంచే ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రాకు నివార్ ముప్పు... సీఎం జగన్ సమీక్ష.. ప్రధాని మోడీ వాకబు!