తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఇరు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ అధికారులు శుభవార్త చెప్పారు. అంతర్రాష్ట్ర ఆర్టీసీ బస్సు సర్వీసులను నడపాలని నిర్ణయించారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓ మెట్టు దిగింది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపేందుకు వీలుపడింది.
అంతరాష్ట్ర బస్ సర్వీసులు నడిపేందుకు డీల్ కుదుర్చుకునే దిశగా రెండు ఆర్టీసీలు అడుగులు వేస్తున్నాయి. దసరా సీజన్ ప్రారంభం కావడానికి ముందే బస్సులు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు లక్ష కిలోమీటర్లను తగ్గించుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ అంగీకరించినట్టు సమాచారం.
రోజురోజుకూ ఆర్టీసీ భారీ నష్టాల్లోకి కూరుకుపోతూ ఉండటంతో, టీఎస్ అధికారులు పట్టుబట్టినట్టుగా, తెలంగాణలో తమ బస్సులను 1.61 లక్షల కిలోమీటర్లు మాత్రమే తిప్పేందుకు ఏపీ అధికారులు ఒప్పుకుని, ఈ మేరకు సమాచారాన్ని పంపినట్టు తెలుస్తోంది. సోమ లేదా మంగళవారాల్లో జరిగే మరో సమావేశంలో దీనిపై మరింత స్పష్టత రానుంది.
వాస్తవానికి ఏపీకి తెలంగాణ రూట్లలో రూ.590 కోట్ల ఆదాయం వస్తుండగా, టీఎస్‌కు ఏపీ రూట్లలో రూ.290 కోట్ల ఆదాయం మాత్రమే వస్తోంది. బస్సులు ఆగిపోయిన తర్వాత ఏపీకే అధిక నష్టం సంభవిస్తుండటంతో, నష్ట నివారణకు మరో మెట్టు దిగి, ముందు బస్సులు నడిపిస్తే చాలన్నట్టుగా, కిలోమీటర్లను తగ్గించుకునేందుకు సంకేతాలు ఇచ్చిందని సమాచారం.
ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రైవేటు ఆపరేటర్లది ఇష్టారాజ్యమైపోయి, అధిక చార్జీలను వసూలు చేస్తుండటం కూడా, సాధ్యమైనంత త్వరగా ఒప్పందం కుదుర్చుకునే దిశగా అడుగులు పడటానికి కారణమైంది. లాక్డౌన్‌కు ముందు ఏపీ నుంచి 72 రూట్లలో 1006 బస్సులు తెలంగాణకు నడుస్తుండగా, టీఎస్ నుంచి 27 రూట్లలో 746 బస్సులు మాత్రమే ఏపీకి వెళుతున్నాయి. ఈ వ్యత్యాసం ఇకపై ఉండరాదని టీఎస్ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.
అందుకు అనుగుణంగానే ఏపీతో ఒప్పందం చేసుకోవాలని భావించిన టీఎస్, తాము మాత్రం కిలోమీటర్లను పెంచుకోబోమని, ఏపీ కిలోమీటర్లను తగ్గించుకుంటే, అభ్యంతరం లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో అధికారుల చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడగా, ఏపీ దిగిరావడంతో దీనికి తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి.