జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్‌కు ఏపీ మంత్రులు మూకుమ్మడిగా వార్నింగ్ ఇచ్చారు. ఆయనకు కులాన్ని ఆపాదించారు. అంతేకాదండోయ్.. తోలు తీస్తామంటూ ఏపీ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు.
రిపబ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు ఏపీ రాజకీయాల్లో కాకరేయాయి. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు రెచ్చిపోతున్నారు. ఇష్టానుసారం అవాకులు, చవాకులు పేలితే తోలు తీస్తామంటూ పవన్‌ను హెచ్చరించారు.
తనపై కోపంతో జగన్ ప్రభుత్వం సినీ పరిశ్రమను చంపేస్తోందని.. కొత్త అప్పుల కోసమే సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలనుకుంటోందని ఆయన చేసిన విమర్శలపై మంత్రులు పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్, అవంతి శ్రీనివాస్ ఆదివారం ఒక్కుమ్మడిగా విరుచుకుపడ్డారు.
ముఖ్యంగా రవాణా-సమాచార మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను సన్నాసిని అయితే.. పవన్ సన్నాసిన్నర అని ధ్వజమెత్తారు. ఆయన కాపు కులానికి చెందినవాడని చెప్పుకోవడానికి తనకు సిగ్గేస్తోందన్నారు.
పవన్ వ్యాఖ్యలపై అటు సినీ పరిశ్రమ నుంచి కూడా భిన్నస్పందనలు వచ్చాయి. పరిశ్రమ మనుగడకు ప్రభుత్వాల మద్దతు అవసరమని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ పేర్కొంది. వేరే వేదికలపై వ్యక్తులు వ్యక్తం చేసే అభిప్రాయాలు, ఆక్రోశాలు పరిశ్రమ మొత్తం చెబుతున్నవి కాదని.. వాటితో తమకు సంబంధం లేదని ఆదివారం ఓ లేఖలో స్పష్టం చేసింది.
పరిశ్రమను ఇబ్బందిపెట్టే నిబంధనలను తెచ్చిన జగన్ సర్కారు.. భవిష్యత్‌లో హీరో మోహన్‌బాబు విద్యాసంస్థలకూ వర్తింపజేస్తుందని పవన్ చేసిన వ్యాఖ్యలపై మోహన్‌బాబు కూడా స్పందించారు. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరుగుతున్నాయని.. అవి పూర్తయ్యాక అన్నిటికీ సమాధానమిస్తానని ట్విటర్‌లో ప్రకటించారు.
అయితే, హీరోలు నాని, సంపూర్ణేశ్‌బాబు, కార్తికేయ గుమ్మకొండ, నటుడు బ్రహ్మాజీ తదితరులు పవన్‌కు మద్దతుగా ట్వీట్లు చేయడం గమనార్హం. చిత్రపరిశ్రమ కష్టాల్లో వుందనీ, రాజకీయాలకు అతీతంగా సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారంతా కోరారు.