Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

39 గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు : మంత్రి కొడాలి నాని

Advertiesment
Andhra Pradesh
, గురువారం, 20 మే 2021 (18:31 IST)
కృష్ణాజిల్లా గుడివాడ రూరల్, నందివాడ మండలాల్లోని 39 గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను సిద్ధం చేస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. గురువారం గుడివాడ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో గుడివాడ రూరల్, నందివాడ మండలాల తహసీల్దార్లు శ్రీనివాస్, అబ్దుల్ రెహ్మన్ మస్తాన్, ఆర్.డబ్ల్యూ.ఎస్ ఏఈ అట్లూరి వెంకటేశ్వరరావులతో డీపీఆర్ పై మంత్రి కొడాలి నాని చర్చించారు. 
 
ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్‌ఏఈ అట్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రాజెక్ట్ నిర్మాణానికి 110 ఎకరాల భూమి అవసరమవుతుందని చెప్పారు. ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన స్టోరేజ్ ట్యాంక్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు తదితరాలను వివరించారు. 
 
అలాగే మండల తహసీల్దార్లు శ్రీనివాస్, అబ్దుల్ రెహ్మాన్ మస్తాన్ మాట్లాడుతూ గుడివాడ రూరల్ మండలం చిలకమూడి ప్రాంతంలో 110 ఎకరాల భూమి అనువుగా ఉంటుందని, అలాగే నందివాడ మండలం జనార్ధనపురం గ్రామ పరిధి కూడా అనువైన ప్రాంతమేనని చెప్పారు. అలాగే మరికొన్ని ప్రాంతాలను కూడా పరిశీలించిన తర్వాత వాటిలో అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేయాలని కోరారు. 
 
ఇదిలావుండగా, గుడివాడ రూరల్ మండలం గుంటకోడూరు, శరీగొల్వేపల్లి, దింటకుర్రు, మోటూరు, పర్నాస, కల్వపూడి అగ్రహారం గ్రామాల్లో తాగునీటి సమస్యలుండగా వీటిని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కరిస్తూ వస్తున్నారు. అలాగే నందివాడ మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్యలు కొనసాగుతున్నాయని, ఈ మండలంలో కూడా ఆయా సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. 
 
రెండు మండలాల్లోనూ మంచినీటి చెరువులకు సమీపంలోనే చేపల, రొయ్యల చెరువులు ఉండడం, ఈ చెరువుల్లోని నీటిని కాల్వల్లోకి వదులుతుండడం, అదే నీటిని తిరిగి మంచినీటి చెరువుల్లో నింపుకోవడం జరుగుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో గుడివాడ రూరల్, నందివాడ మండలాల్లో ఉన్న 39 గ్రామాల్లోని దాదాపు 60 వేల జనాభాకు పరిశుభ్రమైన తాగునీటిని అందించడంపై మంత్రి కొడాలి నాని దృష్టి పెట్టారు. 
 
ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ రూరల్, నందివాడ మండలాల్లోని గ్రామాలు, శివారు ప్రాంతాలకు పరిశుభ్రమైన నీటిని సరఫరా చేసేందుకు మల్టీవిలేజ్ స్కీంను సిద్ధం చేస్తున్నామన్నారు. ఇందు కోసం 110 ఎకరాల భూమిని సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించామన్నారు. రెండు మండలాలకు అనువైన ప్రాంతంలో భూ సేకరణ చేస్తామని, అక్కడ 100 అడుగుల ఎత్తు ఉన్న ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను, స్టోరేజ్ ట్యాంకు, ట్రీట్మెంట్ ప్లాంట్ ను, ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్లను, పంప్ హౌస్, క్లోరినేషన్ ప్లాంట్ తదితరాలను నిర్మిస్తామన్నారు. 
 
60 వేల జనాభాకు అవసరమైన తాగునీటిని ఒకేచోట శుభ్రపర్చి పైప్ లైన్ల ద్వారా రెండు మండలాల్లోని గ్రామాల్లో ఉన్న రక్షిత మంచినీటి పథకాలకు పంపుతామన్నారు. అక్కడి నుండి గ్రామాల్లోని ప్రతి ఇంటికీ తాగునీటిని సరఫరా చేస్తామన్నారు. చేపల, రొయ్యల చెరువుల కారణంగా కలుషితమైన నీటిని వినియోగించాల్సిన అవసరం ఉండదన్నారు. ముఖ్యంగా వేసవిలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. వచ్చే 50 ఏళ్ళ వరకు రెండు మండలాల్లో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చే విధంగా మల్టీవిలేజ్ స్కీంను డిజైన్ చేస్తున్నట్టు మంత్రి కొడాలి నాని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృష్ణాపట్నంలో యథావిధిగా కరోనాకు మందు పంపిణీకి : కాకాణి