Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోలీసులూ మీకు చివరి హెచ్చరిక ఇదే.. నేను హోం శాఖను తీసుకుంటే.. : పవన్ కళ్యాణ్ (Video)

pawan kalyan

ఠాగూర్

, సోమవారం, 4 నవంబరు 2024 (15:50 IST)
ఏపీ పోలీసులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గట్టివార్నింగ్ ఇచ్చారు. ఇదే మీకు చివరి హెచ్చరిక అంటూ సుతిమెత్తగా తలంటు పోశారు. తాను హోం శాఖ బాధ్యతలను తీసుకునే పరిస్థితిని కల్పించవద్దని రాష్ట్ర హోం శాఖ అనితకు కూడా ఆయన గట్టి హెచ్చరిక చేశారు. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 
 
ఈ సందర్బంగా పిఠాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ, రాష్ట్రంలోని పోలీసులపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వ పాలనలో గరుడ్ అనే ఎస్పీ తనపై జులుం ప్రదర్శించాడని వెల్లడించారు. ప్రజలకు అభివాదం చేస్తుంటే, కూర్చోమంటూ తనను భయపెట్టే ప్రయత్నం చేశాడని వివరించారు.
 
'నన్ను కూర్చోమని భయపెడతారు సరే.. మరి ఒక రేపిస్టును మీరు ఎందుకు వదిలేస్తారు? ఒక ముఖ్యమంత్రిని చంపేస్తామని చెప్పినవాడ్ని ఎందుకు వదిలేస్తారు మీరు? మాకు ఈ అన్యాయం జరుగుతోంది అని సోషల్ మీడియాలో పెడితే, అన్యాయానికి కారకులైన వారిని మీరు వదిలేస్తారు! గత ప్రభుత్వ పాలన తాలూకు ఫలితాలు ఇవన్నీ. అప్పులు ఎలా వారసత్వంగా వస్తాయో, వీరు చేసిన నేరాలు కూడా అలాగే వారసత్వంగా వచ్చాయి. వీళ్లు చేసిన అలసత్వం కూడా వారసత్వంగా వచ్చింది.
 
అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి చెబుతున్నాను... లా అండ్ ఆర్డర్ బలంగా అమలు చేయండి అని చెబుతుంటే, పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదు. ఇదివరకేమో శాంతిభద్రతలు మొత్తం నియంత్రణలో లేకుండా చేసేశారు. ఇప్పుడేమో ధర్మబద్ధంగా శాంతిభద్రతలు అమలు చేయమంటుంటే ఆలోచిస్తున్నారు. ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారో అర్థం కావడంలేదు.
 
క్రిమినల్‌కు కులం ఉండదు, క్రిమినల్‌కు మతం ఉండదు... పోలీసు అధికారులకు ఎన్నిసార్లు చెప్పాలి? ఒకడ్ని అరెస్టు చేయాలంటే కులం సమస్య వస్తుందంటారు. కులం సమస్య ఎందుకు వస్తుంది? మూడేళ్ల ఆడబిడ్డను రేప్ చేస్తే కులాన్ని వెనుకేసుకొస్తారా మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ఐపీఎస్ చదివారు కదా... ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెబుతోంది మీకు? క్రిమినల్స్‌ను వెనకేసుకురమ్మని భారతీయ శిక్షా స్మృతి చెబుతోందా మీకు? పోలీసు అధికారులు మారాలి... ఇదే మీకు చివరి హెచ్చరిక! అంటూ కఠువుగా వ్యాఖ్యానించారు. 
 
పోలీసు అధికారులకు చెబుతున్నాను, డీజీపీగారికి కూడా చెబుతున్నాను... ఇంటెలిజెన్స్ అధికారులకు, జిల్లా ఎస్పీలకు చెబుతున్నాను... జిల్లా కలెక్టర్లకు చెబుతున్నాను... అభివృద్ధికి లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైనది. హోంశాఖ మంత్రి అనితగారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. వైసీపీ వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు రౌడీల్లా వ్యవహరిస్తుంటే మీరేం చేస్తున్నారు? ఆడబిడ్డలను అవమానిస్తుంటే మీరు చర్యలు తీసుకోరా? మీరు బాధ్యతగా వ్యవహరించండి... చట్టపరంగా బలంగా వ్యవహరించండి.
 
నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని... హోంమంత్రిని కాను. పరిస్థితి చేయిదాటితే నేనే హోంశాఖను తీసుకుంటాను... నేను హోంశాఖను తీసుకుంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లా వ్యవహరిస్తాను. డిప్యూటీ సీఎం పదవి పోయినా ఫర్వాలేదు... ప్రజల కోసం పోరాటం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఇళ్లలోకి వచ్చి రేప్‌లు చేస్తాం అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు... అది భావప్రకటనా స్వేచ్ఛ అని వైసీపీ నేతలు అంటున్నారు. తెగేదాకా లాగకండి... ఈ ప్రభుత్వానికి సహనం ఎంతుంటుందో, ఈ ప్రభుత్వానికి తెగింపు కూడా పదింతలు ఎక్కువ ఉంటుంది అని పవన్ కళ్యాణ్ అన్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం చంద్రబాబును కలిసిన వేమిరెడ్డి దంపతులు