Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పొదుపు సంఘాలకు మరో తీపికబురు.. తక్కువ వడ్డీరేట్లకే రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన బ్యాంకులు

పొదుపు సంఘాలకు మరో తీపికబురు.. తక్కువ వడ్డీరేట్లకే రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన బ్యాంకులు
, శుక్రవారం, 5 జూన్ 2020 (20:48 IST)
ఆంధ్రప్రదేశ్ లోని లక్షలాధి మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మరో శుభవార్తను  రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.

రాష్ట్రంలో పొదుపు సంఘాలకు బ్యాంకులు అందిస్తున్న వడ్డీరేట్లు అధికంగా వుండటంతో, వాటిని తగ్గించాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రత్యేక చొరవ ఫలించింది. స్వయం సహాయక సంఘాల నుంచి వసూలు చేస్తున్న వడ్డీరేట్లను తగ్గించేందుకు పలు బ్యాంకులు ముందుకు వచ్చాయి.

దాని ద్వారా ఏటా పొదుపు సంఘాలకు రూ.283 కోట్లు మేరకు మేలు జరుగనుంది. అలాగే ప్రభుత్వంపై కూడా సున్నావడ్డీ కింద చెల్లిస్తున్న దానిలో రూ.150.14 కోట్ల భారం తగ్గుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు.   

రాష్ట్రంలో పొదుపు సంఘాలకు బ్యాంకులు ఇస్తున్న వడ్డీరేట్లు అధికంగా వుండటం వల్ల వాటి చెల్లింపుల విషయంలో మహిళలకు ఆర్థికభారంగా మారిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించి, ఈ భారంను సాధ్యమైనంత వరకు తగ్గించాలంటూ బ్యాంకర్లపై అనేక సార్లు వత్తిడి తెచ్చారని అన్నారు.

దీనిలో భాగంగానే 207, 208, 209, 210 ఎస్ఎల్బిసి సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదుపు సంఘాల నుంచి వసూలు చేస్తున్న వడ్డీరేట్ల పై బ్యాంకర్లతో ప్రధానంగా చర్చించారని వెల్లడించారు. పొదుపు సంఘాలను ప్రోత్సహించేందుకు బ్యాంకులు తాము వసూలు చేస్తున్న వడ్డీరేట్లను తగ్గించాలని ఆయన విజ్ఞప్తి చేశారని తెలిపారు.

ఇదే అంశంపై గత ఏడాది జూలై 4వ తేదీన పిఆర్ అండ్ ఆర్టీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో అన్ని ప్రధాన బ్యాంకులతో నిర్వహించిన సబ్ కమిటీ సమావేశంలోనూ పొదుపుసంఘాల వడ్డీరేట్ల తగ్గింపుపై చర్చించారని తెలిపారు.

అలాగే ఈ ఏడాది మార్చి నాలుగో తేదీన సచివాలయంలో ఫైనాన్స్ (ఐఎఫ్‌) స్పెషల్ సెక్రటరీ అధ్యక్షతన బ్యాంకర్లతో జరిగిన ప్రత్యేక సబ్ కమిటీ సమావేశంలోనూ వడ్డీరేట్ల తగ్గింపు, పొదుపుసంఘాల సభ్యులు తమ సేవింగ్స్ ఖాతాల నుంచి పొదుపు మొత్తాలను ఎటువంటి అభ్యంతరాలు లేకుండా విత్ డ్రా చేసుకునేందుకు బ్యాంకర్లు వీలు కల్పించాలనే అంశాలపై ప్రధానంగా చర్చ జరిగిందని వివరించారు. 
 
ప్రారంభంలో ప్రభుత్వ విజ్ఞప్తిపై ఒక్క ఎపి రాష్ట్ర సహకార బ్యాంక్ (ఆప్కాబ్) మినహా మిగిలిన ప్రధాన బ్యాంకుల నుంచి ఎటువంటి స్పందన లభించలేదని తెలిపారు.

ఆప్కాబ్ మాత్రం ప్రభుత్వ మంచి ఉద్దేశానికి అనుగుణంగా పొదుపుసంఘాలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడంతో పాటు, ప్రస్తుతం తీసుకుంటున్న రుణాలకు అదనంగా మరో పదిశాతం రుణాలను కూడా పెంచి ఇస్తామని ముందుకు వచ్చిందని,  అలాగే స్వయంసహాయక బృందాల లావాదేవీలపై ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు, ఇతర చార్జీల వసూళ్ళను కూడా మినహాయింపు ఇస్తున్నామని ఆప్కాబ్ ప్రకటించిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.

బ్యాంకులతో ప్రభుత్వం జరుపుతున్న నిరంతర చర్చల కారణంగా ఆప్కాబ్ బాటలోనే పలు బ్యాంక్ లు తక్కువ వడ్డీరేట్లకే తాము కూడా రుణాలు అందిస్తామంటు ముందుకు వచ్చాయని వెల్లడించారు.  
 
దీనితో స్వయం సహాయక సంఘాలకు లబ్ధి చేకూర్చేలా ఆప్కాబ్, ఇతర బ్యాంకులు ఇచ్చిన వెసులుబాటును 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి వినియోగించుకునేందుకు సెర్ఫ్, ప్రభుత్వ అనుమతి తీసుకుందని, దానికి అనుగుణంగా గతనెల 24వ తేదీన స్వయం సహాయక బృందాలకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిందని తెలిపారు.

ఇప్పటికే అధిక వడ్డీరేట్లతో బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుని, వాటిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగించుకోవాల్సిన స్వయం సహాయక సంఘాలు, తక్కువ వడ్డీ రేటుతో పాటు ఇతర సదుపాయాలు కల్పించేందుకు ముందుకు వచ్చిన ఆప్కాబ్, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డిసిసిబి)లతో పాటు ఇదే తరహాలో తక్కువ వడ్డీని అంగీకరించిన ఇతర బ్యాంకులకు మారాలని సెర్ఫ్ ద్వారా పొదపు సంఘాలకు సమాచారం అందించామని అన్నారు.

ఆయా బ్యాంకులలో పొదుపు మొత్తాల నిల్వలను పెంచుకోవడం, తరువాత రుణసదుపాయాలను ఉపయోగించుకోవడంపై దృష్టి సారించాలని కూడా సూచించామని తెలిపారు. ఈ మేరకు ఎస్ఎల్బిసి ద్వారా రాష్ట్రంలోని అన్ని ఎండిఎంఎస్, బ్యాంక్ కంట్రోలర్స్, డిఆర్డిఎ లకు సెర్ఫ్ నుంచి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. 

వడ్డీరేట్ల తగ్గింపు కోసం తాజాగా విజయవాడలోని సెర్ఫ్ కార్యాలయంలో ఇండియన్ బ్యాంక్ తో పాటు అన్ని ఆర్ఆర్బి అధికారులతో ఎస్ఎల్ బిసి సమావేశం ఏర్పాటు చేసిందని,  ఈ సమావేశంలో ఇతర జాతీయ బ్యాంకులు ఏ విధంగా అయితే తక్కువ వడ్డీరేట్లతో ముందుకు వచ్చారో అదే విధంగా వీరు కూడా పొదుపు సంఘాలకు అండగా నిలవాలని ప్రభుత్వం తరుఫున విజ్ఞప్తి చేశామని తెలిపారు. అన్ని బ్యాంకులు కూడా దీనికి సానుకూలంగా స్పందిస్తాయనే ఆశాభావంను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తం చేశారు. 
 
బ్యాంకుల వారీగా సవరించిన వడ్డీరేట్లు
గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొదుపు సంఘాల రుణాలపై 12.50 శాతం వడ్డీరేటును వసూలు చేసేదని, ప్రస్తుతం దానిని 9.25 శాతంకు తగ్గించిందని తెలిపారు. అలాగే ఆంధ్రాబ్యాంక్, కార్పురేషన్ బ్యాంక్ లను విలీనం చేసుకున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో 12.50 శాతం వడ్డీరేటు వసూలు చేయగా ప్రస్తుతం దానిని 8.10 శాతం నుంచి 9.60 శాతం వరకు తీసుకున్న రుణాలు, అడ్వాన్స్ లను బట్టి వసూలు చేస్తోందని తెలిపారు.

అలాగే ఆప్కాబ్ కూడా 12.50 శాతం నుంచి 10శాతంకు వడ్డీరేట్ ను తగ్గించిందని అన్నారు. సిండికేట్ బ్యాంక్ తో  విలీనమైన కెనరా బ్యాంక్ కూడా 9.15 నుంచి 9.40 వరకు రుణాలు, అడ్వాన్స్ లపై వడ్డీరేట్ ను తగ్గించిందని మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరించారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో పొదుపు సంఘాల మహిళల కష్టాలను స్వయంగా చూసిన నేపథ్యంలో అధికారంలోకి రాగానే వారికి అండగా నిలుస్తానని ఆనాడు మాట ఇచ్చారని, దాని ప్రకారం ఇప్పటికే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 93 లక్షల మంది పొదుపుసంఘాల మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు రూ.1400కోట్ల వడ్డీ భారంను భరించిందని తెలిపారు.

దీనితో రాష్ట్రలో అర్బన్ లో 1.83 లక్షల సంఘాలు, రూరల్ లో 6.95 లక్షల సంఘాలకు మేలు జరిగిందన్నారు. తాజాగా బ్యాంకులు సైతం వడ్డీరేట్లు తగ్గించడం వల్ల పొదుపు సంఘాలకు మరింత మేలు జరుగుతోందని సంతోషం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ ఏడాది హైదరాబాద్ బ్యాడ్మింటన్ టోర్నీ రద్దు