ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవతా విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన మరువక ముందే విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో మూడు సంహాలు మాయమవ్వడం, ఆ తర్వాత నిడమానూరులో సాయిబాబా విగ్రహం ధ్వంసం కావడం చర్చాంశనీయంగా మారింది. తాజాగా మరో ఘటన చోటుచేసుకున్నది.
తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం వద్ద హనుమాన్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఏలేశ్వరం మండలంలోని శివాలయం దగ్గర్లో శ్రీ సీతారామాంజనేయులు వ్యాయామ కళాశాల వద్ద ఉన్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు విరగొట్టారు. ఆంజనేయ స్వామి విగ్రహంలో చేతి భాగాన్ని ధ్వంసం చేయడంతో స్థానికులు భగ్గుమంటున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విగ్రహ ధ్వంసం నేపథ్యంలో హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ అసమర్థత, పోలీసుల నిర్లక్ష్య వైఖరి వల్లే హిందూ ఆలయాల పైన, హిందూ దేవుళ్ల విగ్రహాలపైన దాడులు జరుగుతున్నాయని హిందూ సంఘాలు మండిపడ్డాయి. విగ్రహ ధ్వంసం నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఎటువంటి ఉద్రిక్తలు చోటుచేసుకోకుండా పోలీసులు నిఘా ఉంచారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఈ ఘటన బాధ్యులు ఎవరన్నదానిపై దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనలో బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఏపీలో జరుగుతున్న వరుస ఘటనలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇవి ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతున్నాయి. దీంతో ప్రతిపక్షాలు ఆలయాలు వరుస ఘటనలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండు చేస్తున్నాయి.