విజయవాడ: దేశ వ్యాప్తంగా జనవరి 16న వ్యాక్సినేషన్ పక్రియను కేంద్రం ప్రారంభించిందని.. వ్యాక్సినేషన్ విషయంలో మనం ఆదర్శంగా నిలిచామని ఏపీ వైద్యారోగ్య ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
''ఏపీలో ఒక్కరోజే 6 లక్షల 29 వేల వ్యాక్సినేషన్‌లు వేసి మిగిలిన రాష్ట్రాలు కంటే ఆదర్శంగా నిలిచాం. మన వ్యాక్సినేషన్ కెపాసిటీ ప్రధానికి వివరించాము. వారంలో నాలుగు రోజులు 25 లక్షలు వ్యాక్సినేషన్ వేసే విధంగా, నెలకు కోటి వ్యాక్సిన్ కావాలని సీఎం కేంద్రానికి లేఖ రాశారు.
ఫ్రంట్‌లైన్ వారియర్స్, డాక్టర్లు, 45 ఏళ్ళు పైబడిన 73,49,960 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 53,58,712 మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తవ్వగా... 17,96,691 మందికి సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కంప్లీట్ చేశాం. రాష్ట్రంలో మరో 35 లక్షలు మందికి పైగా సెకండ్ డోస్ ఇవ్వాలి'' అని తెలిపారు.