Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాష్ట్ర చిహ్నాలుగా వేపచెట్టు, మల్లెపూవు, రామచిలుక, కృష్ణ జింక

13 జిల్లాలతో కొత్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఇప్పటికి 4 ఏళ్లు. ఇది 5వ సంవత్సరం. అర్థ దశాబ్దానికి చేరువలో ఉన్నాం. వెనక్కి తిరిగి చూస్తే మనం సాధించిన విజయాలు ఎన్నో. అయినా ఇంకా పొరుగు రాష్ట్రాలతో పోల్చితే వెనుకనే ఉన్నాం. వృద్ధి రేటు వేగంగా ఉన్నా మన

Advertiesment
రాష్ట్ర చిహ్నాలుగా వేపచెట్టు, మల్లెపూవు, రామచిలుక, కృష్ణ జింక
, గురువారం, 31 మే 2018 (22:03 IST)
13 జిల్లాలతో కొత్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఇప్పటికి 4 ఏళ్లు. ఇది 5వ సంవత్సరం. అర్థ దశాబ్దానికి చేరువలో ఉన్నాం. వెనక్కి తిరిగి చూస్తే మనం సాధించిన విజయాలు ఎన్నో. అయినా ఇంకా పొరుగు రాష్ట్రాలతో పోల్చితే వెనుకనే ఉన్నాం. వృద్ధి రేటు వేగంగా ఉన్నా మనతోపాటు ఆ రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతున్ననేపథ్యంలో మన వేగాన్ని తగ్గకుండా చూడటం, వాటిని మించిన వేగాన్ని మరో దశాబ్దంపాటు కొనసాగించడం ద్వారానే అనుకున్న లక్ష్యం చేరుకోగలం. 
 
ఈ కృషిలో మనలో నిరంతర తపన, పట్టుదల, అంకితభావం, చిత్తశుద్ది ఉండాలి. సుస్థిర ఆర్ధికాభివృద్ధి లక్ష్యాలు నిర్ణయించుకుని నిర్ణీత కాలవ్యవధిలో వాటిని చేరుకోవాలి. ఆ తపన, పట్టుదల, చిత్తశుద్ది, అంకితభావం పెరగాలంటే మన ఘనమైన వారసత్వ సంపద, చారిత్రక ప్రాధాన్యత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోవాలి. అందులో భాగంగానే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం నవ నిర్మాణ దీక్ష, మహా సంకల్పం కార్యక్రమాలను చేపట్టింది, ప్రతిఏటా విజయవంతంగా నిర్వహిస్తోంది.
 
ఇది మనం కోరుకున్న విభజన కాదు. అసమానంగా జరిగిన విభజన కొత్తరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ను రూ.16 వేల కోట్ల ఆర్థిక లోటులో ముంచింది. రాజధాని లేకుండా, కట్టుబట్టలతో మన పయనం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తోడుగా చేతిలో చిన్న లాంతరుతో (23 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత) కొత్త రాష్ట్రం పునాదులనుంచి నిర్మాణం బాధ్యత చేపట్టాం. కేంద్రం సహకారం లేకున్నా, ఆర్బీఐ తోడ్పాటు లేకున్నా రూ.24 వేల కోట్ల రైతు రుణ ఉపశమనం, రూ.10 వేల కోట్ల పసుపు-కుంకుమ మహిళలకు, ప్రతి ఏటా రూ.6 వేల కోట్ల పింఛన్లు, రూ.2,500 కోట్ల రేషన్ పంపిణీ, ఎన్టీఆర్ వైద్యసేవ, ఉచిత వైద్యపరీక్షలు, ఆడబిడ్డకు రక్ష, 2 లక్షల సైకిళ్లు, ఉపాధి, పెళ్లి కానుకలు తదితర సంక్షేమ పథకాలు ఎన్నో చేపట్టాం. 
 
రూ.50 వేల కోట్లతో ప్రాధాన్యతా క్రమంలో నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం, భూగర్బ జలాల పెంపు, లాభసాటి వ్యవసాయం, కన్వర్జెన్స్ ద్వారా నరేగాతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి తదితర శాశ్వత వనరులు కల్పిస్తున్నాం. వరుసగా మూడేళ్లుగా రెండంకెల వృద్ధి సాధిస్తున్నాం. దీనిని మరో దశాబ్దం కొనసాగించాలంటే మరింత స్ఫూర్తివంతం కావాలి, పట్టుదల పెరగాలి, చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేయాలి. మనలో చిత్తశుద్ధి, పట్టుదల, అంకితభావం పెంచి స్ఫూర్తిని పొందేందుకే రాష్ట్ర చిహ్నాలుగా వేపచెట్టు, మల్లెపూవు, రామ చిలుక, కృష్ణ జింకలను తెలుగుదేశం ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ట్ర వృక్షంగా వేపచెట్లు, రాష్ట్ర పుష్పంగా మల్లెపూవు, రాష్ట్ర పక్షిగా రామచిలుక, రాష్ట్ర జంతువుగా కృష్ణ జింకను ఎంపిక చేయడం వెనుక ఎంతో ఆర్తి ఉంది, తపన ఉంది, స్ఫూర్తి ఉంది.
 
కొత్త రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలందరిలో స్ఫూర్తిని పెంచేందుకు, పట్టుదల అధికం చేసేందుకు, చిత్తశుద్దితో, అంకిత భావంతో వర్తమానం అధిగమించి భవిష్యత్తు వైపు సాగిపోయేందుకే ఈ చిహ్నాలను రాష్ట్రచిహ్నాలుగా ఎంపిక చేయడం జరిగింది. 
 
వేపచెట్టు(రాష్ట్ర వృక్షం): ఎన్నో సుగుణాలున్న చెట్టు. స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది. ఆరోగ్యాన్ని ఇస్తుంది. సౌందర్య పోషణ. సర్వరోగ నివారిణి. ఆయుర్వేదంలో కీలకం. ఇంటింటి ఆరోగ్యదేవత, వనదేవతగా పూజిస్తారు. తెలుగు సంవత్సరాది రోజున ఉగాదినాడు వేప పూతతో ఉగాది పచ్చడి తినని తెలుగువాడు ఉండడు. (వేప చెట్టులానే మన ఆంధ్రప్రదేశ్ కూడా స్వచ్ఛరాష్ట్రం కావాలి. ఎటువంటి రోగాల దరి చేరకుండా ఆరోగ్యంగా ఉండాలి. చీడపీడలు సోకకుండా పదికాలాలు కళకళలాడాలి. అందరి అభిమానం చూరగొనాలి. పూజింపబడాలి)
 
మల్లెపూవు (రాష్ట్రపుష్పం): అందానికి అందం, పరిమళానికి పరిమళం. ఉల్లాసం, ఉద్దీపనం, ఔషధం, ఆరోగ్యం, సుగంధ సుగుణం, చర్మ సౌందర్యం. ఇంత అందమైన, సుగుణాలు కల పుష్పరాజం ఇదే. (మల్లెపూవులానే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా అందంగా, సుగంధ పరిమళాలతో ఉల్లాసంగా ఉండాలి, ఉద్దీపన చెందాలి, సమస్త సుగుణాలతో విలసిల్లాలి)
 
రామచిలుక(రాష్ట్ర పక్షి): అందం, ఆహ్లాదం, ఆహార్యంలో అద్భుతమైనది. ఆకుపచ్చ, ఎరుపు రంగుల పిట్ట. తెలివైనది, పెంపుడు పక్షి, భవిష్య(జోస్యం)వాణి, రాయబారి. (రామచిలుకలానే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా ఆహ్లాదంగా, శోభాయమానంగా ఉండాలి. తెలివిగా, సమయ స్ఫూర్తిగా, సుహృద్భావ సంబంధాలు కలిగి,భవిష్యత్ దిశగా సాగిపోవాలి)
 
కృష్ణజింక(రాష్ట్రమృగం): హుషారైనది. అందమైనది. చురుకైనది. సునిశిత పరిశీలన, మెరుపు వేగం, అప్రమత్తమైనది. (కృష్ణ జింకలానే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా హుషారుగా, చురుకుగా సాగిపోవాలి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడేం జరుగుతుందో సునిశిత పరిశీలన కలిగివుండాలి. మెరుపువేగంతో సమధిక వృద్ధివైపు పయనించాలి)
 
అందుకే వీటిని రాష్ట్ర చిహ్నాలుగా ఎంపిక చేయడం జరిగింది. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలలో స్ఫూర్తిని పెంచడమే వీటి ఎంపిక లక్ష్యం. ఇదే స్ఫూర్తితో ప్రతిఏటా జూన్ 2న జరిగే నవనిర్మాణ దీక్షలో పునరంకితం అవుదాం. ప్రగతి ప్రతిజ్ఞ పూనుదాం. నాలుగేళ్ల అభివృద్ధిని సమీక్షిద్దాం. భవిష్యత్ దిశా నిర్దేశం చేసుకుందాం. 2022 నాటికి దేశంలో 3వ అగ్రగామి రాష్ట్రంగా, 2029 నాటికి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను రూపొందించాలనే ‘మహా సంకల్పం’ చేద్దాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనుమానంలేదు... ఆపరేషన్ గరుడే... పవన్-జగన్ కలిసి...