ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం భారీగా నిధులను కేటాయించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నిధులను కేటాయించినట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఏపీలో రూ.84,559 కోట్ల విలువైన రైల్వే పనులు జరుగుతున్నాయని తెలిపారు. రానున్న కాలంలో ఏపీ వ్యాప్తంగా 73 రైల్వే స్టేషన్ రూపు రేఖలు మారిపోనున్నాయని వెల్లడించారు. ఏపీలో రైల్వే పనులకు సీఎం చంద్రబాబు విశేష సహకారం అందిస్తున్నారని చెప్పారు.
ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ, ఏపీ రైల్వే ప్రాజెక్టుల ప్రస్తావన తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.84,559 కోట్ల విలువైన రైల్వే పనులు ఇప్పటికే జరుగుతున్నాయని వెల్లడించారు. అందుకే బడ్జెట్ లో ప్రత్యేకంగా ఏపీ గురించి ప్రస్తావించలేదని వివరణ ఇచ్చారు.
రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి రూ.9,417 కోట్లు కేటాయించామన్నారు. యూపీఏ హయాంలో కేటాయించిన నిధుల కంటే 11 రెట్లు అధికంగా నిధులు కేటాయించామని చెప్పారు. ఇక, ఏపీలో 73 రైల్వే స్టేషన్ల రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తున్నామని వెల్లడించారు. ఆయా రైల్వే స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతామని తెలిపారు.
మున్ముందు ఏపీకి మరిన్ని వందేభారత్ రైళ్లు కేటాయిస్తామని... ప్రస్తుతం ఏపీలోని 16 జిల్లాల మీదుగా 8 వందేభారత్ రైళ్లు తిరుగుతున్నాయని గుర్తుచేశారు. అన్ని రైళ్లు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ఏపీలో అన్ని రైల్వే ట్రాక్‌లు సిద్ధం చేస్తున్నామని... కొన్ని మార్గాల్లో గంటకు 130 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ట్రాక్‌లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.