Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అధికారం శాశ్వతం కాదు జగన్ రెడ్డి: సాకే శైలజనాథ్

అధికారం శాశ్వతం కాదు జగన్ రెడ్డి: సాకే శైలజనాథ్
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 12 నవంబరు 2021 (14:05 IST)
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు శాంతియుతంగా చేస్తున్న అమరావతి మహా పాదయాత్ర పై ప్రభుత్వం లాఠీ ఛార్జ్ చేయటం అమానుషమని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆరోపించారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను కూడా హరిస్తారా? అని ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదు అని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. 
 
 
'ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్నవారిపై ప్రభుత్వం లాఠీ ఛార్జ్ చెయ్యడం దారుణం. ప్రభుత్వ దాడిలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలి. న్యాయస్థానాల ఉత్తర్వులను ధిక్కరిస్తూ ఉద్యమకారులపై లాఠీఛార్జ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి' అని  శైలజనాథ్ డిమాండ్ చేశారు. ఎంతోమంది నియంతలే నేల  రాలిపోయారని, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకోవడం తగదని విమర్శించారు. 
 
 
అధికారంలోకి రాక మునుపు జగన్ రెడ్డి చేసిన ప్రజా సంకల్ప యాత్రలో ఇలాగె వ్యవహరించి ఉంటే అడుగు ముందుకు వేసే వారా ? అని తెలుసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కంటికి రెప్పలా కాపాడుతూ బాధ్యతగా వ్యవహరించామని పేర్కొన్నారు. ప్రభుత్వం బలప్రయోగించి పాదయాత్రకి అడుగడుగునా ఆటంకాలు కల్పించడం న్యాయమా?  అని ప్రశ్నించారు. హైకోర్టు అనుమతితో చేస్తున్న పాదయాత్రకి ప్రభుత్వ ఆంక్షలు ఎందుకో? అని నిలదీశారు. అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలని, జగన్ రెడ్డి కి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని శైలజనాథ్ పేర్కొన్నారు.
 
 
 గతంలో ముఖ్యమంత్రులెవరూ ఇంత దారుణంగా పాలించలేదని అన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయన్నారు. కష్టపడి తెచ్చుకున్న ప్రజాస్వామ్యాన్ని, సొంతానికి వాడుకుంటూ ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. నియంత పాలనను సాగిస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ మండిపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిక్కడపల్లిలో బ్యూటీపార్లకు‌కు వెళ్లిన మహిళ అదృశ్యం