Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తొలి మహిళా మంత్రిణి విజయలక్ష్మీ పండిట్

Advertiesment
భారతదేశం
FILE
భారతదేశపు ప్రప్రథమ ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూకు స్వయానా సోదరి. ప్రముఖ విద్యావేత్త, రచయిత, మహిళా నాయకురాలుగా ఎదిగిన మహిళ విజయలక్ష్మీ పండిట్ దేశంలోని మహిళలకు ఆదర్శంగా నిలిచారు. నేడు ఆమె జన్మదినం.

అలహాబాద్‌లో తే 18.8.1900ది నాడు మోతీలాల్ నెహ్రూ దంపతులకు పుట్టిన గారాలపట్టి పండిట్ విజయలక్ష్మీ. ఈమె అసలు పేరు స్వరూప్‌కుమారి నెహ్రూ. మహిళలు చదువుకోకూడదన్న కఠినమైన నిబంధనలున్న ఆ రోజుల్లోనే ఆమెను ఉన్నతమైన చదువులు చదివించారు మోతీలాల్ నెహ్రూ.

భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందే బ్రిటీష్‌- ఇండియా ప్రభుత్వంలో జరిగిన సాధారణ ఎన్నికలలో ప్రజాప్రతినిధిగా ఎంపికై తొలి భారత మహిళా మంత్రిగా ఆమె చరిత్ర పుటలలోకి ఎక్కారు. స్వదేశంలోనేగాక ఆమె విదేశాలలోనూ తొలి భారత మహిళా రాయబారిగా అమెరికా, బ్రిటన్‌, సోవియట్‌ యూనియన్‌ దేశాలకు పనిచేశారు.

జవహర్‌లాల్‌ నెహ్రూ, విజయలక్ష్మీపండిట్‌ ఒక మొక్కకు పూచిన రెండు పువ్వులు. తండ్రి మోతీలాల్‌ నెహ్రూ విజయలక్ష్మిని కుమారునితో సమానంగా పెంచాడు. ఆ రోజుల్లోనే మహిళా స్వేచ్ఛకు మోతీలాల్‌ ఎంతో విలువనిచ్చాడు. ఈమె తన తండ్రి దిశానిర్దేశాలతో చిన్నప్పటినుంచే పట్టుదల, దీక్ష, దృఢసంకల్పంతో పెరిగారు. ఆడవారు చదువుకునే వీలుకాని పరిస్థితిలో సైతం ఆమె పట్టుబట్టి ఉన్నత చదువులు చదివారు.

1921లో రంజిత్‌ సీతారాం పండిట్‌ను వివాహం చేసుకున్నారు. వివాహం అయ్యేంతవరకూ ఆమె స్వరూప్‌కుమారిగానే వ్యవహరించారు. వివాహానంతరం ఆమె విజయలక్ష్మీ పండిట్‌గా పేరును మార్చుకున్నారు.

1937లో తొలిసారిగా బ్రిటీష్‌ ఇండియాలో నిర్వహించిన సాధారణ ఎన్నికలలో పోటీచేసి అఖండ మెజారిటీతో గెలుపొందారు. తొలిసారిగా భారతదేశ చరిత్రలోనే ఒక మహిళామంత్రిగా ఈమె చరిత్ర సృష్టించారు. అప్పటి బ్రిటీష్‌ ఇండియాకు పంచాయితీ వ్యవహారాలు, ప్రజారోగ్యశాఖ మంత్రిణిగా ఆమె నియమించబడ్డారు. రెండు సంవత్సరాల కాలం ఆమె ఈ పదవిలో కొనసాగారు.

1946-47 సంవత్సరం మధ్య తిరిగి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1947 స్వాతంత్య్రానంతరం 1947-49 మధ్యకాలంలో సోవియట్‌ యూనియన్‌ రష్యా దేశానికి భారత రాయభారిగా నియమించబడ్డారు. ఆ తర్వాత 1949-51 మధ్యకాలంలో అమెరికా, మెక్సికో దేశాల రాయబారిగా, 1955-61 మధ్యకాలంలో ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌, తర్వాత స్పెయిన్‌ తదితర దేశాలకు భారత విదేశీ రాయబారిగా కీలకపదవుల్లో కొనసాగారు.

భారత్‌లోనూ ఆమె అనేక కీలకపదవులను చేపట్టారు. 1962-64 మధ్యకాలంలో మహారాష్ట్ర గవర్నర్‌గా చేశారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. ఏ పదవిలో ఉన్నా ఆమె ఆ పదవికే వన్నెతెచ్చేవారు. ముఖ్యంగా సోవియట్‌ యూనియన్‌తో భారత సంబంధాలు ఆమె హయాంలోనే మహోన్నతంగా వికసించాయనడంలో అతిశయోక్తి లేదు.

ఆమెలో మరో వ్యక్తిని కూడా మనం చూడగలుగుతాం. దేశప్రజలకు ఉత్తమ రచనలు అందించిన రచయిత్రిగా ఆమెను మనం చూడొచ్చు. ‘ది ఇవాల్యూషన్‌ ఆఫ్‌ ఇండియా’, ‘ది స్కోప్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌’ లాంటి రచనలు కొన్ని మచ్చుతునకలు మాత్రమే. ఇలాంటి మహోన్నతమైన భావాలు కలిగిన మహిళ నేటి మహిళలకందరికీ ఆదర్శనీయురాలనడంలో సందేహం లేదు.

Share this Story:

Follow Webdunia telugu