స్థలమునకు తూర్పు, ఉత్తర వీధులున్నట్లైతే ఆ స్థలాన్ని ఈశాన్యపు బ్లాకు అంటారని వాస్తు శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. ఈ స్థలము అన్ని బ్లాకుల కంటే విశిష్టమైంది. ఉత్తరమున ఉన్న వీధి, పశ్చిమం నుండి ఉత్తరమునకు పల్లంగాను ఉంటే ధన-ధాన్యములు, పేరు ప్రతిష్టలూ కలుగుతాయి.
ఈశాన్యభాగంలో ఎటువంటి షెడ్స్ కట్టిమూత వేయకూడదు. దీనివలన అశుభములు కలుగుతాయి. స్థలములో ఈశాన్య భాగం ఖాళీగా వదిలినప్పటికీ గృహములో నిర్మించిన ఈశాన్యగదికి తలుపులు లేకుండా కట్టినా ఈశాన్యం మూతవేసినట్లే అవుతుంది. దీనివలన ఎన్నో అనర్థాలు కలుగుతాయి.
స్థలములో ఈశాన్యం వైపు కట్టడం మిగిలిన దిశలకంటే ఎత్తుగా ఉండకూడదు. దీనివలన సర్వారిష్టములు కలుగుతాయి. ఈశాన్యంలో విశాలమైన ఖాళీ స్థలాన్ని వదలడం అన్ని విధముల శుభపలితాలనిస్తుంది.
అంతేకాకుండా ఈశాన్యంలో చెత్తా-చెదారములు వేయకూడదు. దీనివలన దారిద్ర్యం చోటు చేసుకుంటుంది. ఈశాన్యంలో మరుగు దొడ్లు ఉండకూడదు. ఈశాన్యం నుండి వాడుక నీటిని బయటకు పంపే ఏర్పాటు చేసినట్లైతే సకలశుభములు కలుగును. ఈశాన్యమున నిర్మించు ద్వారము- తూర్పు-ఈశాన్యమైతే మంచి ఫలితములు కలుగునని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.