ఇంటిలో బీరువా ఎటు వైపు ఉండాలి?
, సోమవారం, 7 అక్టోబరు 2013 (16:30 IST)
మనిషి జీవితంలో అతి ముఖ్యమైనది ప్రేమానుబంధాల తర్వాత డబ్బే. నిజంగా చెప్పాలంటే.. కొన్ని సందర్భాల్లో ఈ డబ్బే అనుబంధాలను కూడా మించి పోతుంది. అలాంటి ధనంను నిల్వ చేసుకునే బీరువాను ఇంటిలో ఎటు వైపు ఉంచుకోవాలన్న అంశంపై వాస్తు నిపుణులను సంప్రదిస్తే.. ఇంటి నిర్మాణంలో వాస్తు శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఏ గది ఎటు వైపు ఉండాలో నిర్దేశించినట్లే, బీరువా వంటి ముఖ్యమైన వస్తువులు ఏవి ఎక్కడ ఉండాలో మన పూర్వీకులు నిర్ణయించారు. ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో అసలు బరువు ఉండకూడదని చెప్పినట్లే, కొన్ని చోట్ల బరువు ఉంటే మంచిదని కూడా సూచించారు. ఆ ప్రకారంగా ఇంటిలో నైరుతి భాగంలోనే బరువును పెట్టాలని చాలా మంది భావిస్తుంటారు. నిజానికి ఈ దిక్కున పెట్టకూడదట. బీరువాను ఉత్తర వాయువ్యవంలో ఉంచాలి. ఎందుకంటే వాయువ్యం చంద్రునిది. చంద్రుడు ధన ప్రవాహానికి అధిపతి. కనుక వాస్తు సూచనలను అనుసరించి, డబ్బు నగలు భద్రపరచుకునే బీరువా ఉత్తర వాయువ్యంలో (అంటే పశ్చిమానికి - ఉత్తరానికి మధ్య ఉండే మూలలో) ఉంచాలని వాస్తు శాస్త్రం చెపుతోంది బీరువా దక్షిణ దిక్కు చేసి పెట్టాలి. అది శ్రేష్టం. అంటే మనం బీరువా తెరిచినపుడు మనం ఉత్తరం వెపు చూస్తుండేలా ఉండాలి. ఈ సూచన పాటించినట్లయితే డబ్బు నష్టం జరగదు. ధన ప్రవాహానికి ఆటంకం కలగకుండా వస్తూ ఉంటుంది. అలా కుదరకపోతే బీరువాను ఉత్తర దిక్కు మధ్య కూడా ఉంచొచ్చు. ఉత్తర దిక్కుకు బుద్ధుడు అధిపతి. బుద్ధుడు సంపదలకు అధిపతి కనుక బీరువాను ఉత్తర దిక్కు మధ్యభాగంలో ఉంచినా కూడా మంచిదే. బీరువా మాత్రం దక్షిణ ముఖమే చూస్తూ ఉండాలి. ఎట్టి పరిస్థితుతుల్లోనూ బీరువా నైరుతి మూలలో ఉంచొద్దు. అలా చేస్తే మనకు ఎంత డబ్బు వచ్చినా అది చాలదు. వచ్చింది వచ్చినట్టే పోతుంటుంది.