Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

న్యాయమూర్తులకో నీతి.. విద్యార్థులకో నీతినా? అవి 'మనునీతి పరీక్షలు' : హీరో సూర్య

న్యాయమూర్తులకో నీతి.. విద్యార్థులకో నీతినా? అవి 'మనునీతి పరీక్షలు' : హీరో సూర్య
, మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (09:57 IST)
తమిళ హీరో సూర్యపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. కరోనా సమయంలో నీట్‌ పరీక్షను నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. ముఖ్యంగా, కరోనా భయంతో వీడియో కాన్ఫరెన్సుల ద్వారా కేసులపై విచారణ జరుపుతున్న న్యాయమూర్తులు.. విద్యార్థులను నీట్‌ పరీక్షకు హాజరు కావాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకే వస్తాయని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఎస్‌ ఎం సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. 
 
కాగా, గత ఆదివారం దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షలు నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్న వేళ నీట్ పరీక్షలు వద్దుబాబోయ్ అంటూ మొరపెట్టుకున్నప్పటికీ.. కేంద్రం మాత్రం ఈ పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపింది. ఆ తర్వాత విపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించినా, కోర్టు కూడా పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపింది. ఈ తీర్పుపై సూర్య స్పందించారు. 
 
నీట్ పరీక్షలపై హీరో సూర్య చేసిన వ్యాఖ్యలు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను కించపరిచేలా ఉన్నాయని, ఆయనపై కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదు చేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎం సుబ్రమణియం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏపీ సాహికి లేఖ రాశారు. సోమవారం ఉదయం రాసిన ఈ లేఖపై తీవ్రస్థాయిలో కలకలం రేగింది.
 
నీట్‌ పరీక్షల భయంతో తమిళనాడులో వారం కిందట నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. విద్యార్థుల మరణం తనను మానసికంగా ఎంతో కలచి వేసిందని పేర్కొంటూ.. నటుడు సూర్య ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఓ ప్రకటనలో 'కరోనా వ్యాప్తి నేపథ్యంలో గౌరవ న్యాయమూర్తులు తమ ప్రాణాల పట్ల భయంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసుల విచారణ చేస్తూ తీర్పులు వెలువరిస్తున్నారు.
 
కానీ, నీట్‌ విషయంలో వేల సంఖ్యలో ఉన్న విద్యార్థులను మాత్రం భయపడకుండా పరీక్షా కేంద్రాలకు వచ్చి నీట్‌ రాయాలని ఉత్తర్వులు జారీ చేయడం విడ్డూరం. ఇవి 'మనునీతి పరీక్షలు'' అని పేర్కొన్నారు. సూర్య ప్రకటనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభించింది. అయితే, ఈ వ్యాఖ్యల అనువాదాన్ని ప్రామాణికంగా తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎం.సుబ్రమణియం సూర్యపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.
 
ఇదిలావుంటే, సూర్య చేసిన తమిళ ప్రకటన అనువాదాన్ని న్యాయమూర్తి సుబ్రమణియం ప్రామాణికంగా తీసుకున్నారని, ఈ అనువాదంలో దోషాలు ఉన్నాయని, సూర్య చేయని వ్యాఖ్యలను అనువాద కాపీలో చేర్చారని హైకోర్టు మాజీ న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. అందువల్ల సూర్యపై ధిక్కరణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని, ఆయన ఎవరినీ కించపరచలేదని వారు పేర్కొన్నారు. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ కె.చంద్రూ, జస్టిస్‌ కేఎన్‌ బాషా, జస్టిస్‌ సుదందిరం, జస్టిస్‌ హరిపద్మనాభన్‌, జస్టిస్‌ కె.కన్నన్‌, జస్టిస్‌ జీఎం అక్బర్‌ అలీ హైకోర్టు సీజేకి లేఖలు రాయడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో మళ్లీ కరోనాకు రెక్కలొచ్చాయ్.. 24 గంటల్లో 2వేల కేసులు