కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజార్టీ వస్తే ప్రధానిని నేనే : రాహుల్ క్లారిటీ
దివంగత ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపున గాంధీ కుటుంబానికి చెందిన వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టలేదు. నిజానికి యూపీఏ కూటమి తరపున ప్రధానిగా సోనియా గాంధీకి అవకాశం వచ్చినా ఆమె
దివంగత ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపున గాంధీ కుటుంబానికి చెందిన వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టలేదు. నిజానికి యూపీఏ కూటమి తరపున ప్రధానిగా సోనియా గాంధీకి అవకాశం వచ్చినా ఆమె ప్రధాని కుర్చీలో కూర్చొనేందుకు సిద్ధపడలేదు. దీంతో ఆమె స్థానంలో ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ఎంపిక చేయగా, ఆయన పదేళ్ళ పాటు ప్రధానిగా కొనసాగారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్న ఇటీవలికాలంలో ఉత్పన్నమైంది. నిజానికి పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీనే ప్రధాని అభ్యర్థనేది బహిరంగ రహస్యమే అయినప్పటికీ, ఏఐసీసీ ఇప్పటికీ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే దీనిపై పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో క్లారిటీ ఇచ్చారు.
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తే తానే ప్రధాని మంత్రి అవుతానని ఆయన ప్రకటించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బళ్లారిలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. కర్ణాటకలో అత్యంత అవినీతిపరుడిని భారతీయ జనతా పార్టీ సీఎం అభ్యర్థిగా నిలబెట్టిందని ఆయన దుయ్యబట్టారు. బళ్లారిలో రూ.35 వేల కోట్ల ప్రజాధనాన్ని గాలి సోదరులకు దోచిపెట్టారని మండి పడ్డారు. గాలి వర్గానికి వర్గానికి 15 సీట్లు కేటాయించడంపై ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.