Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దాడికి ప్రయత్నిస్తే.. బట్టలూడదీసి తరిమితరిమి కొడతాం.. 48 గంటల డెడ్‌లైన్ : పవన్

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై అసత్య ఆరోపణలు చేసినా, కిరాయి మూకలు, గూండాలతో దాడికి ప్రయత్నిస్తే బట్టలూడదీస

దాడికి ప్రయత్నిస్తే.. బట్టలూడదీసి తరిమితరిమి కొడతాం.. 48 గంటల డెడ్‌లైన్ : పవన్
, బుధవారం, 23 మే 2018 (19:04 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై అసత్య ఆరోపణలు చేసినా, కిరాయి మూకలు, గూండాలతో దాడికి ప్రయత్నిస్తే బట్టలూడదీసి తరిమికొడతామని ఆయన హెచ్చరించారు.
 
తాను చేపట్టిన ప్రజా పోరాట యాత్ర బుధవారానికి నాలుగో రోజుకు చేరింది. ఈ యాత్రలోభాగంగా, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మాట్లాడుతూ, టెక్కలిలో తాము చేపట్టిన నిరసన కవాతు జరగకుండా లారీలు అడ్డుపెట్టారని ఆరోపించారు. మంగళవారం రాత్రి పలాసలో తాను బసచేసిన చోట కరెంట్ తీసి కిరాయి మూకలు ద్వారా దాడిచేయాలని చూశారన్నారు. తాను అన్నింటికీ తెగించిన వ్యక్తినని.. ప్రజాసమస్యలపై పోరాటానికి వచ్చినోడినని.. ఇలాంటి పిచ్చిపిచ్చి పనులకు భయపడేవాడిని కాదని భావోద్వేగంగా ప్రసంగించారు. 
 
'శ్రీకాకుళం సైనికులు పుట్టిన నేల.. స్వేచ్ఛామాత పుట్టిన నేల... భరతమాతకి గుడివున్న ఏకైక నేల.. దేశంలో ఏ మూలకెళ్లినా ఓ శ్రీకాకుళం సైనికుడు కనపడతాడు. జైహింద్ అంటాడు. వాడికి స్ఫూర్తిగానే ఈ మిలటరీ చొక్కా వేసుకున్నాను. రౌడీలను, గూండాలను పంపిస్తే... మేం సైనికులమని గుర్తుపెట్టుకోండి... నిర్ధాక్షణ్యంగా ఉంటాం. కిరాయి గుండాలను బట్టలూడదీసి కొడతాం... వేషాలు వేయొద్దు నా దగ్గర.. మీ గుండాలకి.. కిరాయిమూకలకి... భయపడతామనుకున్నారా.? జాగ్రత్త.. ఖబడ్దార్' అంటూ గద్గగ స్వరంతో హెచ్చరించారు. 
 
అంతేకాకుండా, శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న ఏడు మండలాల్లో వెంటనే ప్రజలందరికీ రక్షిత మంచినీటిని అందించాలని, వెంటనే రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖా మంత్రిని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త ఆరోగ్య మంత్రిని నియమించేందుకు, ఉద్దానం కిడ్నీ సమస్యలు నెరవేర్చేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి తాను 48 గంటల గడువును ఇస్తున్నానని, ఈలోగా చంద్రబాబు దిగొచ్చి, ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. 
 
ఒకవేళ చంద్రబాబు దిగిరాకుంటే తన యాత్రను ఆపేసి, ఇక్కడే నిరాహారదీక్షకు దిగుతానని, ఆపై జరిగే పరిణామాలకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. తనకు అధికారం లేకపోయినా సమస్యలపై స్పందిస్తున్నానని, అధికారంలో ఉన్నవారు స్పందించకుంటే ప్రజల కష్టాలు ఎలా తీరుతాయని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఆరోగ్య మంత్రి లేకపోవడం సిగ్గు చేటని, మంత్రిని నియమించకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేతులు పిసుక్కుంటూ భాజపా... మొత్తం సినిమా 2019లో వుందంటున్న నారా లోకేష్