తాను తలపెట్టిన ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటును ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపారు సోనూసూద్. కర్నూలులో తొలి ప్రాధాన్యంగా ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఎంతోమందికి సాయం చేస్తున్న నటుడు సోనూసూద్. తన ఆధ్వర్యంలోని తొలి సెట్ ఆక్సిజన్ ప్లాంట్లను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి, నెల్లూరు ఆత్మకూరులోని జిల్లా ఆస్పత్రిలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే మిగతా రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ ప్లాంట్లను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా తనను కోరిన ఎంతోమందికి ఆక్సిజన్ కాన్సట్రేటర్లను అందించారు సోనూసూద్.
ఇవి సరిపోకపోవడం వల్ల విదేశాల నుంచి ఆక్సిజన్ ప్లాంట్లను తెప్పించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే తొలి ప్రాధాన్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.