Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు ద్రౌపది ముర్ముుకు పట్టాభిషేకం : సర్వం సిద్ధం

murmu
, సోమవారం, 25 జులై 2022 (08:01 IST)
భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో సోమవారం ఉదయం 10.15 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అనంతరం సైనికులు.. ముర్ముకు '21 గన్ సెల్యూట్' సమర్పిస్తారు. సైనిక వందనం స్వీకరించిన తర్వాత రాష్ట్రపతి హోదాలో ముర్ము ప్రసంగిస్తారు.
 
ప్రమాణస్వీకారానికి ముందు ప్రస్తుత రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, నూతనంగా ఎన్నికైన రాష్ట్రపతి ముర్ము పార్లమెంటుకు ఊరేగింపుగా వస్తారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లోక్​సభ స్పీకర్ ఓంబిర్లా, మంత్రిమండలి సభ్యులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, దౌత్యవేత్తలు, కీలక సైనికాధికారులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. 
 
పార్లమెంట్ సెంట్రల్ హాలులో కార్యక్రమం ముగిసిన తర్వాత.. ముర్ము రాష్ట్రపతి భవన్​కు పయనమవుతారు. అక్కడ త్రివిధ దళాలు గార్డ్ ఆఫ్ హానర్ సమర్పిస్తాయి. అనంతరం పదవీ విరమణ చేసిన రాష్ట్రపతి గౌరవార్థం కార్యక్రమాలు చేపడతారు. ప్రమాణస్వీకారం కోసం సంప్రదాయ సంతాలీ చీరను ముర్ము కోసం ఆమె వదిన సుక్రీ టుడూ తీసుకెళ్లారు. 
 
శనివారమే తన భర్త తరినిసేన్ టుడూ(ముర్ము సోదరుడు)తో కలిసి ఢిల్లీకి బయల్దేరారు సుక్రీ. పార్లమెంటులో జరిగే కార్యక్రమానికి వీరు హాజరుకానున్నారు. 'దీదీ కోసం నేను సంతాలీ చీర తీసుకెళ్తున్నా. ప్రమాణస్వీకారానికి ఈ చీర ధరిస్తుందని ఆశిస్తున్నా. నిజానికి ఆమె ఈ చీరే ధరిస్తారో లేదో తెలియదు. దుస్తులపై రాష్ట్రపతి భవన్​దే తుది నిర్ణయం' అని సుక్రీ పేర్కొన్నారు.
 
మరోవైపు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ఎన్​వీ రమణ అరుదైన ఘనతను సొంతం చేసుకోనున్నారు. రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయించనున్న తొలి తెలుగు వ్యక్తిగా జస్టిస్‌ రమణ ఖ్యాతి గడించనున్నారు. సాధారణంగా రాష్ట్రపతితో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రస్తుతం సీజేఐగా ఉన్న జస్టిస్‌ రమణ.. ఆ గౌరవం దక్కించుకున్నారు. ఇప్పటివరకు ఏ తెలుగు వ్యక్తి భారత రాష్ట్రపతితో ప్రమాణం చేయించకపోవడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉద్యోగిని భవానీ సూసైడ్ కేసు - వైకాపా నేత అరెస్టు