Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సికింద్రాబాద్‌లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు - యూపీలోనూ 2 రైళ్లకు

agnipath
, శుక్రవారం, 17 జూన్ 2022 (11:34 IST)
సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి. శుక్రవారం కూడా పలు రాష్ట్రాల్లో యువత చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌లో నిరసనకారులు పలు రైళ్లకు నిప్పు పెట్టారు.  
 
ఇపుడు ఆ సెగ హైదరాబాద్‌కూ తాకింది. ఫలితంగా సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరే ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఒక్కసారిగా యువకులు ఆందోళనకు దిగడంతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
 
అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కొంతమంది యువకులు ఆందోళనకు దిగారు. రైలు పట్టాలపై పార్సిల్‌ సామాన్లు వేసి నిరసన తెలిపారు. అగ్నిపథ్‌ను రద్దు చేసి యథావిధిగా సైనిక ఎంపిక కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో రైలు పట్టాలపై పార్సిల్‌ సామాన్లు వేసి నిప్పు పెట్టారు.
 
అలాగే, యూపీలోని బల్లియాలో శుక్రవారం ఉదయం కొంతమంది నిరసనకారులు రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించి పట్టాలపై ఆగిన రైళ్లకు నిప్పుపెట్టారు. స్టేషన్‌లోని ఆస్తులను ధ్వంసం చేశారు. అయితే రైళ్లలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు.
 
మరోవైపు బీహార్‌లోని మొహియుద్దినగర్ స్టేషన్‌లోనూ జమ్మూతావి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు చెందిన రెండు బోగీలకు నిరసనకారులు నిప్పంటించారు. ఈ ఘటనలోనూ ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదని పోలీసులు తెలిపారు. లఖ్‌మినియా రైల్వే స్టేషన్‌ వద్ద ఆందోళనకారులు పట్టాలపై కూర్చొని నిరసన చేపట్టారు. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలోనూ ఈ నిరసనలు జరిగాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం: ద్వితీయ భాషగా తెలుగు