50వ వసంతంలో యువసామ్రాట్ నాగార్జున!
టాలీవుడ్ "కింగ్"గా తన హవాను కొనసాగిస్తున్న యువసామ్రాట్ అక్కేనేని నాగార్జున.. "కింగ్" తర్వాత కొంత గ్యాప్ తీసుకుంటున్నారు. ఈ నెల 29 (శనివారం)న నాగ్ పుట్టినరోజు. ఈ 50వ పుట్టినరోజు నాగ్‌కు స్పెషల్ బర్త్ డే అని సినీ వర్గాల్లో టాక్. అసలు విషయమేమిటంటే..? తన కుమారుడైన నాగచైతన్య హీరోగా పరిచయమవుతున్న "జోష్" చిత్రం ఇదే రోజున విడుదల కానుందని సినీ వర్గాల సమాచారం. ఈ సందర్భంగా నాగ్‌కు, జోష్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ.. "మన్మథుడి" గురించి కొంచెం తెలుసుకుందాం.. సుప్రసిద్ధ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు తనయుడైన నాగార్జున ప్రాథమిక విద్యను నాగార్జున హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో ముగించారు. లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ చేసిన నాగ్, మద్రాసులో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. తర్వాత మిచిగన్ విశ్వవిద్యాలయంలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉన్నత విద్యను అభ్యసించారు.ప్రముఖ నటుడు వెంకటేష్ సోదరి లక్ష్మితో నాగార్జునకు ఫిబ్రవరి 18, 1984లో వివాహమైంది. వీరిద్దరు విడాకులు తీసుకున్న తర్వాత.. 1992 జూన్ నెలలో నాగార్జున శివ చిత్రంలో సహనటి అయిన అమలను పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే నాగార్జునకు ఇద్దరు కుమారులున్నారు. మొదటివాడు నాగచైతన్య (పుట్టినతేది నవంబర్ 23, 1986), రెండోవాడు అఖిల్ (పుట్టిన తేది ఏప్రిల్ 8 1994).1986
వ సంవత్సరం మే 23వ తేదీన విడుదలైన "విక్రం"తో తెరంగేట్రం చేసిన నాగార్జున సంకీర్తన, కిరాయిదాదా, మురళీకృష్ణుడు, విజయ్, విక్కీదాదా, గీతాంజలి, శివ, ప్రేమయుద్ధం, నేటి సిద్ధార్థ, ఇద్దరు ఇద్దరే, చైతన్య, శాంతి క్రాంతి, క్రిమినల్, రక్షకుడు, ఆటోడ్రైవర్, బావనచ్చాడు, స్నేహమంటే ఇదేరా, సంతోషం, మన్మథుడు, శివమణి, నేనున్నాను, కృష్ణార్జున వంటి.. ఇంచు మించు 80 సినిమాల్లో నటించి మాస్ హీరోగా ముద్రవేసుకున్నాడు. శివ, అన్నమయ్య, సంతోషం వంటి చిత్రాలకు ఉత్తమ నటుడి అవార్డును సొంతం చేసుకున్న నాగార్జున, మన్మథుడు చిత్రానికి గాను ఉత్తమ నిర్మాతగా నంది అవార్డును కైవసం చేసుకున్నాడు. అలాగే సూపర్ చిత్రానికి ఫిలింఫేర్ తెలుగు ఉత్తమ నటుడు బహుమతికి ఎంపికైన నాగ్, శ్రీరామదాసు చిత్రానికి ఉత్తమ నటుడిగా నంది అవార్డును గెలుచుకున్నాడు. ఇకపోతే.. నాగార్జున పుట్టినరోజు: ఆగస్టు 29, 1959,జన్మస్థలం: చెన్నై,ముద్దుపేరు: నాగ్,సినీ తెరంగేట్రం: 1986,తాజా సినిమా: ఆకాశమంత దర్శకుడు రాధామోహన్‌తో (ఇంకా చర్చల్లో..),వయస్సు: 50 సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్న నాగార్జున.అక్కినేని నాగేశ్వర రావు నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియోస్‌ని పునరుద్ధరించి తెలుగు సినిమా పరిశ్రమలో విజయవంతమైన నిర్మాతగా పేరు తెచ్చుకుని.. సినీ రంగంలో 25 సంవత్సరాల వసంతాలకు దగ్గరవుతోన్న అక్కినేని నాగార్జునకు పుట్టిన రోజు శుభాకాంక్షలు...