Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కల్మషంలేని కథానాయకుడు (ఎన్టీఆర్ బయోపిక్ మూవీ రివ్యూ) (video)

కల్మషంలేని కథానాయకుడు (ఎన్టీఆర్ బయోపిక్ మూవీ రివ్యూ) (video)
, బుధవారం, 9 జనవరి 2019 (14:02 IST)
నటీనటులు : బాలకష్ణ, విద్యాబాలన్‌, ప్రకాష్‌ రాజ్‌, రానా, సుమంత్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌, క్రిష్‌ తదితరులు
 
సాంకేతికత: సినిమాటోగ్రఫర్‌ : జానశేఖర్‌, సంగీతం : కీరవాణి, ఎడిటర్‌ : రామకష్ణ, 
నిర్మాతలు: బాలకష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి, 
దర్శకత్వం : క్రిష్‌ జాగర్లమూడి.
 
ఎన్టీఆర్ బయోపిక్‌ అనగానే చిన్నతనం నుంచి ఆయన జీవితంలోని జరిగిన సంఘటనలు అన్నీ కలిపి చూపిస్తారని ప్రేక్షకులు డిసైడ్‌ అయ్యారు. కానీ చిన్నతనం కాకుండా ఉద్యోగం చేసుకునే సమయం నుంచి కథ తీసుకుని సినిమాల్లోకి వెళ్ళి అక్కడ నుంచి తన కుటుంబం, రాజకీయ జీవితం ఎలా ఆరంభించాడనే పాయింట్‌ వరకు తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా తీశారో తెలుసుకుందాం. చిత్రంలోని మొదటి భాగం 'ఎన్టీఆర్‌ కథానాయకుడు' పేరుతో జనవరి 9వ తేదీ బుధవారం విడుదలైంది. 
 
కథ :
ఎన్టీఆర్‌ (బాలకష్ణ) రిజిస్టార్‌గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ లంచం పేరుతో పేదలకు జరిగే అన్యాయాన్ని సహించలేక రాజీనామా చేసేస్తాడు. అదేరోజు ఆయన పెళ్ళిరోజు. ఎప్పుడో ఎల్‌విప్రసాద్‌ మదరాసు రమ్మని రాసిన ఉత్తరాన్ని బయటకు తీసి భార్య, కుటుంబ సభ్యుల అనుమతి తీసుకుని మదరాసు వెళతాడు. అక్కడ ఎల్‌విప్రసాద్‌ను కలవడం, హెచ్‌ఎం.రెడ్డి, చక్రపాణి వంటివారి సాయంతో నటునిగా అంచెలంచెలుగా ఎదుగుతాడు. ఆ తర్వాత ప్రజలతో మమేకమై వారిబాగు కోసం ప్రభుత్వాలు చేయలేని పనిని తన భుజాలమీద వేసుకుని చేస్తాడు. అదే రాజకీయ ప్రవేశం. ఇదంతా ఎలా జరిగింది? దానికి కారణాలేమిటి? నటుడిగా ఆయన పడిన కష్టనష్టాలేమిటి? ఆయన నటజీవితంలో ఇతరుల పాత్ర ఎంతుంది? నాగార్జున, రామారావుకు పడదనే బయట వున్నా అందులో ఎంత నిజముంది? అనేది తెరపై చూడాల్సిందే. 
 
విశ్లేషణ:
నటనలో విశ్వసార్వభౌముడు కనుక ఆయన పాత్రను చేయడం మరొకరికి సాధ్యంకాదు. పైగా ఆహార్యం ప్రధానం. అవన్నీ ఆయన రక్తంపంచుకుని పుట్టిన బాలకృష్ణకే సాధ్యం. అందుకే అంతటి సాహసం చేశాడు. ఇన్నాళ్ళు చేసిన బాలకృష్ణ నటన వేరు. ఇందులో చేయడం వేరు. ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుంది. ఆ తర్వాత బసవతారకం, ఏ.యన్‌.ఆర్‌. ఈ పాత్రల్లో నటించిన విద్యా బాలన్‌, సుమంత్‌ ఫర్వాలేదనిపించారు. ముఖ్యంగా విద్యా బాలన్‌ బసవ తారకం పాత్రకు కరెక్ట్‌గా సరిపోయింది. సినిమాలపరంగా కృష్ణుడి గెటప్‌లో అద్భుతంగా కన్పించాడు.

 
ఆ తర్వాత అన్నదమ్ముల అనుబంధం సినిమా రిలీజ్‌ సమయంలో మదరాసులో అల్లర్లు వంటి సన్నివేశాలకు ఎదుర్కొన్న తీరు ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రకృతి వైపరీత్యాల వల్ల రాయలసీమ కరువు, ఆ తర్వాత వచ్చిన దివిసీమ ఉప్పెనతో.. అతని మనస్సు ఎలా కకావికలం అయిందనేది తెరపై చూడాల్సిందే. రాజకీయాల్లోకి రావడానికి దారితీసిన పరిస్థితులను చక్కగా చూపెట్టాడు.
webdunia
 
ఇక బయోపిక్‌లంటే ఫాస్ట్‌ఫుడ్‌ సినిమా కాదుకనుక నింపాదిగా సాగుతుంది. ఆ తర్వాత ఆసక్తిరమైన మలుపులు గ్రిప్పింగ్‌ నరేషన్‌ ఆశించడం కష్టమేమరి. మొదటిభాగమంతా పాత్రలు వస్తూ పోతుంటాయి. అవి పేరుపెట్టి పెలిస్తే కానీ ఆ పాత్ర ఇతను అను అర్థంకాదు. ఎందుకంటే  ఏ పాత్రకూ ఇంకొకరు సూట్‌ కావడం ఇంపాజిబుల్‌. అయినా కథనంలో నడిచిపోయింది. శ్రీదేవిగా రకుల్‌, సావిత్రిగా నిత్యమీనన్‌ ఫర్వాలేదనిప్తారు. కానీ బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాలు బుల్లితెరపై ఎన్‌టిఆర్‌వి చూస్తున్న ఈ రోజుల్లో ఆయనలా కన్పించడం కష్టమేకానీ ఆయనంత హుషారుగా బాలకృష్ణ చేసి మెప్పించాడు.

 
తెలుగు ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మహా నటుడు ఎన్టీఆర్‌ జీవిత కథను తెరకెక్కించడం సవాలుతో కూడుకున్న పని. ఈ విషయంలో క్రిష్‌ చాలా వరకు విజయం సాదించాడనే చెప్పొచ్చు. సావిత్రిలాంటి సినిమాను తెరకెక్కిస్తే ఆమె ఏవిధంగా ఇతరులతో మోసపోయిందనేది ఆసక్తిగా చూడాలనేది ప్రేక్షకులకు కలుగుతుంది. కానీ ఎన్‌టిఆర్‌లో అవేవీ వుండవు. కల్మషంలేని మనిషి. అలాంటి వ్యక్తి తన ముందున్న కర్తవ్యాలను ఎదురీగి ఎలా సక్సెస్‌ అయ్యాడనేది కన్పిస్తుంది. ఇదంతా తెలిసిన కథే. అందులో ట్విస్ట్‌ వుండదు. 
 
కానీ.. రాజకీయ జీవితం తర్వాత ఆయన కెరీర్‌లో పలు మలుపులుంటాయి. అవి ఎలా వుంటాయనేవి ఆసక్తికరం. అది చూడాలంటే వచ్చేనెల వరకు ఆగాల్సిందే. ఇక కీరవాణి సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా బ్యాక్‌‌గ్రౌండ్‌‌స్కోర్‌ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అయితే ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త శ్రద్ద వహిస్తే బాగుండేది. సాయి మాధవ్‌ బుర్ర రాసిన సంభాషణలు కూడా బాగున్నాయి. 
 
ఇక ఎన్‌.బి.కె ఫిలిమ్స్‌. వారాహి, విబ్రి మీడియా ప్రొడక్షన్‌ వాల్యూస్‌ చాలా బాగున్నాయి. మొత్తంగా ఈ చిత్రం ఎన్‌టిఆర్‌ గతంలో పరిస్థితులు ఇలా ఉండేవని తెలియజెప్పే ప్రయత్నం. ఇందులో తన కొడుకు రామకృష్ణ చనిపోయిన సందర్భం, ఆకలితో వుంటూ తన వారికి భోజనం టిక్కెట్లు ఇవ్వడం వంటి సెంటిమెంట్‌ సీన్లు బాగా పండాయి. మొత్తంగా మంచి ప్రయత్నం చేశారనే చెప్పాలి. 

- మురళీకృష్ణ పెండ్యాల

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఎందుకు పాటలో వర్మ టార్గెట్ చేశారా? లక్ష్మీపార్వతి ఏమంటున్నారు?