Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెన్నై చుట్టూ తిరిగే రెజీనా, సందీప్ కిషన్ 'నగరం'... రివ్యూ

నాలుగు రకాల పాత్రలు. అవన్నీ ఓ సంఘటనతో ముడిపెట్టడం అనేది ఈమధ్యనే వస్తున్న ట్రెండ్‌. 'చందమామ కథలు' అంటూ ఆమధ్య తీసినా.. అంతకుముందే పలు చిత్రాలు వచ్చాయి. 'యువ', 'జర్నీ' వంటి కథలు అలాంటివే. చూడ్డానికి హాలీవుడ్‌ కథల్లావున్నా వాటిని తమిళ పరిశ్రమ ప్రయోగాలు చ

Advertiesment
చెన్నై చుట్టూ తిరిగే రెజీనా, సందీప్ కిషన్ 'నగరం'... రివ్యూ
, శుక్రవారం, 10 మార్చి 2017 (18:58 IST)
నగరం నటీనటులు: సందీప్‌ కిషన్‌, రెజినా, శ్రీ, చార్లి, రాందాస్‌, మధుసూదన్‌ తదితరులు; సంగీతం: జావేద్‌ రియాజ్‌, కెమెరా: సెల్వ కుమార్‌, నిర్మాతలు: అశ్విని కుమార్‌ సహదేవ్‌, దర్శకత్వం: లోకేష్‌ కనగరాజ్‌.
 
నాలుగు రకాల పాత్రలు. అవన్నీ ఓ సంఘటనతో ముడిపెట్టడం అనేది ఈమధ్యనే వస్తున్న ట్రెండ్‌. 'చందమామ కథలు' అంటూ ఆమధ్య తీసినా.. అంతకుముందే పలు చిత్రాలు వచ్చాయి. 'యువ', 'జర్నీ' వంటి కథలు అలాంటివే. చూడ్డానికి హాలీవుడ్‌ కథల్లావున్నా వాటిని తమిళ పరిశ్రమ ప్రయోగాలు చేస్తుంది. అలాంటిదే 'నగరం'. దాన్ని తెలుగులో అదే పేరుతో డబ్‌ చేశారు. సందీప్‌ కిషన్‌, రెజీనా జంటగా నటించిన ఈ చిత్రం ఎలా తీశారో చూద్దాం.
 
కథ :
చెన్నై నగరానికి బతుకుతెరువుకోసం వచ్చిన ఓ కుర్రాడు. అదే ఊరిలో వుంటూ బేవార్స్‌గా తిరుగుతూ అమ్మాయి ప్రేమ కోసం పాటుపడే సందీప్‌ కిషన్‌. పిల్లాడి ఆపరేషన్‌ కోసం నగరం వచ్చి, ఇక్కడ రూటు తెలీకపోయినా టాక్సీ నడుపుకూంటూ జీవనం సాగించే సగటు జీవి. ఏదో చేయాలని ఓ కిడ్నాప్‌ ముఠాతో చేతులు కలిపిన అమాయకుడు. వీరందరూ నగరంలో పెద్ద డాన్‌ కొడుకు కిడ్నాప్‌తో ప్రమేయం లేకుండా ఇరుక్కోవడం.. దాంతో ప్రమాదంలో పడడం.. దాన్నుంచి ఎలా బయటపడ్డారనేది సినిమా.
 
విశ్లేషణ :
ఇందులో ప్రతి కథలోని పాత్రల్ని కలపడం.. అనుకోని మలుపులు.. ఒకరికొకరు పేరు తెలియకపోయినా సాయపడటం అనేవి ఆసక్తి కల్గిస్తాయి. ఇలాంటి కథలకు సహజంగా వుండాలనే దర్శకుడు తీసుకున్న సన్నివేశాలు, ప్రాంతాలు కరెక్ట్‌గా సరిపోయాయి. ఆరంభం నుండి చివరివరకు కొనసాగించబడిన సస్పెన్స్‌. దీని వలన తరువాతి సన్నివేశంలో ఏం జరుగుతుందో అనే ఉత్సుకతతో ఎక్కడా ప్రేక్షకుడి ఆసక్తి సడలిపోలేదు. దర్శకుడు లోకేష్‌ తను రాసుకున్న మంచి స్క్రీన్‌ ప్లేని తెరపై ఆవిష్కరించి కాస్త సంక్లిష్టమైన కథను అర్థమయ్యేలా వివరించాడు.
 
సందీప్‌ కిషన్‌ నటుడిగా కథలోని పాత్రలో కలిసిపోయాడు. నిర్లక్ష్యం ఉన్న కుర్రాడిగా అతని లుక్స్‌, హావభావాలు, నటన అన్నీ మెప్పించాయి. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పాత్రలో చేసిన మరొక యువ నటుడు శ్రీ కూడా బాగా నటించాడు. హెచ్‌ఆర్‌గా రెజీనా నటన ఓకే. మొదటి భాగం మొత్తాన్ని మంచి ఆసక్తికరమైన కిడ్నాప్‌ సన్నివేశాలతో చాలా బాగా నడిపాడు దర్శకుడు. కిడ్నాపర్‌ డెన్‌, సందీప్‌కిషన్‌ ఇల్లు చాలా సహజంగా వున్నాయి. చిన్నచిన్న కథలను కలిపి మంచి కథనంతో ప్రధాన కథను తయారుచేయడం మెప్పించింది. అలాగే చెన్నై లాంటి మహా నగరంలో నేరాలు జరిగే విధానాన్ని రియలిస్టిక్‌గా చూపడం బాగుంది.
 
కాగా, హీరోయిన్‌ రెజీనాకు కథలో అంతగా ప్రాధాన్యం లేదు. ఇలాంటి వేగవంతమైన కథనం ఉన్న సినిమాల్లో సన్నివేశాలు కూడా వేగంగానే ఉండాలి. కానీ ఇందులో కాస్త సాగదీసిన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. అవి కథనం యొక్క వేగాన్ని కాస్త దెబ్బతీశాయి. ఫస్టాఫ్‌ బాగున్నా లెంగ్త్‌ కాస్త ఎక్కువైనట్టు తోచింది. దీనికి పకడ్బందీ స్క్రిప్ట్‌ అవసరం. దాన్ని కాగితంపై ఎంత బాగా రాసుకున్నా తెరపై చూపించాలంటే సాహసమే. పాత్రల కష్టాలు, కోపతాపాలు, ఆవేశాలు, మలుపులు చక్కగా తీసుకున్నా కొన్నిచోట్ల గందరగోళ పర్చాడు. సీరియస్‌గా సాగే కథనంలో కిడ్నాపర్‌తో చేతులు కలిపిన అమాయకుడి పాత్రే కాస్త ఆటవిడుపు. పతాక సన్నివేశం అంతగా ఆకట్టుకోదు. తమిళ సినిమా కాబట్టి వారి ఫార్మెట్‌లోనే వుంది. 
 
టెక్నికల్‌గా చూసుకుంటే.. సంభాషణలపరంగా శ్రద్ధ కనబర్చాడు. పుట్టిన ఊరు నుంచి బతుకుదెరువు కోసం నగరం వచ్చిన చాలామంది ఇక్కడ మోసాలు, కష్టాలను తిట్టుకుంటూ వుంటారే మినహా.. ఒక్కడూ వెనక్కు వెళ్ళడు. ఇలాంటి మాటలు సందర్భానుసారంగా అతికినట్లున్నాయి. సెల్వకుమార్‌ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. క్రైమ్‌ సన్నివేశాల్ని చాలా రియలిస్టిక్‌గా చూపించాడు. చెన్నై మహా నగరాన్ని స్క్రీన్‌ మీద ఆవిష్కరించిన తీరు బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. డబ్బింగ్‌ కూడా తగిన విధంగా ఉంది. సౌండ్‌ డిజైన్‌ డిపార్ట్మెంట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మామూలు థ్రిల్స్‌ని కూడా మంచి బ్యాక్‌‌గ్రౌండ్‌ స్కోర్‌తో చాలా ప్రభావవంతంగా చూపించారు. దర్శకుడు లోకేష్‌ రాసుకున్న కథను చాలా బాగా చెప్పాడు. 
 
నటీనటుల ప్రతిభ, కథనంలోని మలుపులు ఆసక్తిగా వున్నాయి. అయితే తగినట్లు కథనం నత్తనడకగా సాగడం.. ముగింపు తేల్చేయడంతో అమాయకుడి పాత్రపై జాలి వేస్తుంది. ఏది ఏమైనా కష్టపడిందే మనకు దక్కుతుంది. అయాచితంగా రూపాయివచ్చినా ఆశించకూడదనేది ఆ పాత్ర ద్వారా దర్శకుడు చెప్పాడు. ఇలా నాలుగు రకాల పాత్రల్ని ప్రేక్షకుడి కోణంలో చూపించే ప్రయత్నం ఫర్వాలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేష్ బాబు-మురుగదాస్ సినిమా.. లుక్ రిలీజ్.. అందగాడు మరింత అందంగా?