Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామ్ చరణ్ కు 'గోవిందుడు అందరివాడెలే' మరో మగధీర.... రివ్యూ రిపోర్ట్

Advertiesment
Govindudu Andarivadele telugu movie review
, బుధవారం, 1 అక్టోబరు 2014 (13:42 IST)
గోవిందుడు అందరివాడేలే నటీనటులు: రామ్ చరణ్‌ , కాజల్, శ్రీకాంత్, కమలినీ ముఖర్జి, ప్రకాష్‌ రాజ్, జయసుధ, కోట శ్రీనివాసరావు, రావూ రమేష్, పోసాని కృష్ణమురళి తదితరులు
 
సంగీతం: యువన్‌శంకర్ రాజా, రచన: పరుచూరి బ్రదర్స్, కథ, స్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణవంశీ, నిర్మాత: బండ్ల గణేష్
 
మగధీర, రచ్చ, నాయక్, ఎవడు ఇలా యాక్షన్ సినిమాలే చేస్తూ వచ్చిన రామ్ చరణ్ ఫ్యామిలీ ప్యాక్ తో ఈసారి కొత్తగా గోవిందుడు అందరివాడేలే అంటూ కుటుంబ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు శుక్రవారం కాకుండా బుధవారం వచ్చేశాడు. కాజల్ అగర్వాల్‌తో ముచ్చటగా మూడోసారి జోడీ కట్టడమే కాకుండా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో చేశాడు. భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ కూడా ఎక్కడా రాజీపడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
 
 
కథగా చెప్పాలంటే... 
పల్లెటూళ్లో ఉండే ప్రకాష్‌రాజ్-జయసుధ దంపతులకు ఇద్దరు కొడుకులు. ఉమ్మడికుటుంబం. పెద్ద కొడుకు డాక్టర్ అవుతాడు. సొంత ఊళ్లో హాస్పిటల్ కట్టించి పేదలకు వైద్యం చేయమంటాడు తండ్రి. కానీ అతడు తండ్రి మాటకు వ్యతిరేకంగా తాను ప్రేమించిన అమ్మాయిని చేసుకుని లండన్‌కు చెక్కేస్తాడు. అతడి కొడుకే అభిరామ్(రామ్ చరణ్). లండన్ నుంచి ఫ్యామిలీని కలుసుకోవాలనుకున్న తండ్రి కోరిక మేరకు పల్లెటూరు చేరుకుంటాడు అభి. అక్కడ తన తాత బాలరాజు(ప్రకాష్‌రాజు)కు దగ్గరవుతాడు. అభి అక్కడ పెరిగినా భారతదేశ ఆచారసంప్రదాయాలు ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం. అభి తమ మనవడే అన్న విషయం ఆ కుటుంబంలో ప్రకాష్‌రాజ్‌కి తప్ప అందరికి తెలిసిపోతుంది. ఇదిలావుండగా అభి కాజల్‌తో ప్రేమలో పడతాడు. అయితే తాత ప్రకాష్‌రాజ్ కాజల్‌కు మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయించేస్తాడు. మరి అభి ఏం చేశాడు...? కాజల్ ను పెళ్లి చేసుకుంటాడా...? బాలరాజు ఏం చేశాడు...? అనేది తెలుసుకోవాలంటే చిత్రం చూడాల్సిందే.
 
పాత్రలు....
 
హీరో రామ్ చరణ్ తొలిసారిగా కుటుంబ తరహా క్యారెక్టర్‌లో నటించినా చాలా బాగా చేశాడనే చెప్పొచ్చు. సెంటిమెంట్ సీన్లలో, ఫైటింగ్ సీన్లలో మెప్పించాడు. మగధీర చిత్రంలో పాత్రలానే గోవిందుడు అందరివాడెలే చిత్రంలోని పాత్ర కూడా గుర్తిండిపోతుంది. అతడి కేరీర్‌కు ఇది మరో మెట్టు. కాజల్, కమిలినీ ముఖర్జీ యాక్షన్ కూడా బావుంది. ముఖ్యంగా ప్రకాష్‌రాజ్-జయసుధలు సినిమాలో నటించారు అనేకంటే ప్రాణం పోశారని చెప్పొచ్చు. శ్రీకాంత్ కూడా చెర్రీకి బాబాయిగా బాగా నటించాడు. ఇంట్లోంచి గెంటివేసిన పాత్రలో బాగా చేశాడు. విలన్ గ్యాంగ్‌గా ప్రకాష్‌రాజ్‌కు తోడల్లుడు పాత్రలో కోట శ్రీనివాసరావు, అతడి కుమారుడు రావూ రమేష్, కోట మనవడిగా ఆదర్శ్ అందరూ చిత్రంలో ఇమిడిపోయారు.
 
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత మరో కుటుంబ కథా చిత్రంగా గోవిందుడు అందరివాడెలె చిత్రం నిలుస్తుందనడంలో సందేహం లేదు. కుటుంబ విలువలను చాటి చెప్పే చిత్రం తీసిన కృష్ణవంశీ, నిర్మాత బండ్ల గణేష్‌తో పాటు ఈ చిత్రంలో నటించాలని నిర్ణయించుకున్న హీరో రాంచరణ్ అందరినీ మెచ్చుకుని తీరాలి. కథాకథనంలో చిన్న చిన్న లోపాలు తప్పితే సినిమా ఆకట్టుకుంటుంది. కుటుంబ సమేతంగా చిత్రాన్ని చూడొచ్చు.

Share this Story:

Follow Webdunia telugu