Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రోకర్ కాదు 'బ్రోతల్‌'... రివ్యూ రిపోర్ట్

Advertiesment
Broker 2 Movie review
హైదరాబాద్ , శుక్రవారం, 30 మే 2014 (18:36 IST)
బ్రోకర్ నటీనటులు : పోసాని కృష్ణమురళి, బెనర్జీ, జీవా, మాదాల రవి, స్నేహ తదితరులు, కెమెరా: వెంకట్‌ మన్నం, ఎడిటింగ్‌: విజయ్‌ బాబు, విజయ్‌: సంగీతం:, నిర్మాత: సుధాకరరావు, కథ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మద్దినేని రమేష్‌.
 
సినిమాలు తీయడమనేది ప్రస్తుతం చాలా సుళువయిపోయింది. ఏ రంగలోని వారైనా సినిమాలు తీయవచ్చు. కానీ దర్శకత్వం వహించడమనేది ఓ పని. ఆ పనిలో కాస్తోకూస్తో అవగాహన ఉంటేనే లక్షలాది ప్రేక్షకుల మనస్సును రంజింపజేయవచ్చు. ఏదో పైపైన ఉన్న ఆలోచనలతో మెగాఫోన్‌ పట్టుకుని సినిమా చేసేశామనుకుంటే అంతకంటే అజ్ఞానం మరొకటి ఉండదు. సమాజాన్ని ప్రభావితం చేసేది మీడియానే. అది టీవీ మీడియా కావచ్చు. సినిమా కావచ్చు. 
 
టీవీలో సీరియల్స్‌లో చూపిస్తున్న ఆడవాళ్ళ తగవులు ఎంత దరిద్రంగా అనిపిస్తాయో... నేటి రాజకీయాలు కూడా అలానే ఉంటాయి. వాటిని టచ్‌ చేసేటప్పుడు వాటిపై పూర్తి అవగాహన ఉండాలి. లేదంటే.. పైనపైనే ఓ పుస్తకాన్ని చదివినట్లు సినిమాగా చుట్టేస్తే 'బ్రోకర్‌-2'లా ఉంటుంది. అసలు బ్రోకర్‌ అంటే ఏమిటి? అతను ఏం చేశాడు? అనేది తెలుసుకోవాలంటే... శుక్రవారం అంటే 30న విడుదలైన సినిమా కథలోకి వెళ్ళాల్సిందే.
 
కథేంటి...? 
రాజకీయనాయకుల మధ్య మీడియేటర్‌గా ఉండే బ్రోకర్‌ దేవుడు(పోసాని కృష్ణమురళి). రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్లంబర్‌ జాతీయ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి దాస్‌(జీవా)ను అధిష్టానం దించేస్తుంది. ఆ పదవి చంద్రబోస్‌(బెనర్జీ)కి దక్కుతుంది. ఇందుకు దేవుడు చేసిన బ్రోకర్‌ పనులే కారణం. ఇక అక్కడ నుంచి బోస్‌ తన పదవిని కాపాడుకోవడానికి నానా తంటాలు పడతాడు. పదవిలో ఉండగానే కోట్లు సంపాదించాలనే ధ్యేయాన్ని పెట్టుకుంటాడు. ఇందుకు దేవుడే అన్ని సమకూరుస్తాడు. కన్నకూతురి భవిష్యత్‌ కన్నా పదవే ముఖ్యమనే సి.ఎం. బోస్‌ చేసే అరాచకాలు ఒక్కొక్కటిగా మాజీ సిఎం. దాసు బటయపెడుతుంటాడు. ఆ తర్వాత ఏమయింది? అనేది సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌ 
పోసాని కృష్ణమురళి పాత్రే కీలకం. అన్ని చిత్రాల్లో చేసినట్లుగానే తనదైన శైలిలో డైలాగ్‌లు పలికిండచడం, హావభావాలు చూపించడం చేశాడు. స్టెప్‌లు వేయడం రాని ఈయనకు ఓ సాంగ్‌ కూడా ఉంటుంది. సి.ఎం.గా బెనర్జీ తనదైన శైలిలోనే నటించాడు. ఇక ప్రత్యేక పాత్రలో డా|| మాదాల రవి నటించాడు. ఆయన నటించిన రెండు పాటల్లోనే ఇలా పాటలు పాడి అలా వెళ్ళిపోతాడు. జీవా, హర్ష తదితరులు ఏదో చేశారు అనిపిస్తుంది.
 
టెక్నికల్‌గా...
సినిమాటోగ్రఫీ గొప్పగా ఏమీలేదు. లైటింగ్‌ చాలాచోట్ల డల్‌గా ఉంది. సాహిత్య పరంగా చైతన్య ప్రసాద్‌ రాసిన పాటలు పర్వాలేదు. అయితే వాటిని తెరపైకెక్కించే విధానం అంతగా ఆకట్టుకోలేకపోయింది. విజయ్‌ బాణీలు సినిమాకు తగినట్లుగానే ఉన్నాయి. ఇక మిగిలిన శాఖల గురించి చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ ఉండదు.
 
విశ్లేషణ 
ముఖ్యంగా దర్శకుడు గురించి చెప్పాలి. గతంలో 'బ్రోకర్‌' చిత్రాన్ని నిర్మించాడు. అప్పట్లో వై.ఎస్‌. ప్రభుత్వం ఉన్న హయాంలో హైదరాబాద్‌లోని ఫ్లై ఓవర్‌ నిర్మాణంలో జరుగుతున్న అవినీతి గురించి అందులో చెప్పాడు. మళ్ళీ ఇన్నాళ్ళకు స్వార్థ రాజకీయాల్లో అవినీతి ఎలా ఉంటుందనేది చెప్పే ప్రయత్నం చేశాడు. ఇందుకు తానే దర్శకుడిగా మారాడు. సమాజంలో జరిగే సంఘటనలు రోజువారీ పేపర్లలోనూ టీవీల్లోనూ చూస్తూనే ఉన్నాం. వాటినన్నింటినీ కలగలపి వెండితెరపై తీసుకువస్తే ఎలా ఉంటుందనేది దర్శకుడి తపనలో కన్పిందించి. అందుకు రకరకాల కథలు అల్లి.. పాత్రలు చుట్టి... ఆకట్టుకునేలా చేయాలనుకుని భంగపడ్డాడు. 
 
ఇప్పుడు కూడా గతంలో వైఎస్‌ బతికి ఉండగా.. నేను దేహమయితే తను ఆత్మ అంటూ వై.ఎస్‌. చెప్పిన సిద్దాంతంతోనే బెనర్జీ, పోసాని పాత్రలుంటాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా ఉండే మనిషి కేవలం తన పదవి కాపాడుకోవడం కోసమే చేసే పనులే కన్పిస్తాయి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని కోట్లు కాజేయాలనే ఆలోచనే కన్పిస్తుంది మినహా ఎటువంటి సేవ ప్రజలకు చేశామనేది చెప్పలేకపోయాడు. 
 
అవినీతికి ఒకడు పాల్పడితే తప్పేంటి.. ఎవడు పాల్పడటం లేదంటూ... సామాన్యుడికి చెప్పే మాటల్లోంచి ప్రజా కళాకారుడిగా వచ్చిన డా. మాదాల రవి పాటల రూపంలోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ పాత్రకు సరైన క్లారిటీ లేదు. కథకంటే సంభాషణల మీదనే శ్రద్ధ పెట్టాడు దర్శకుడు. ముఖ్యమంత్రిగా తొలి సంతకం ప్రజలకు మేలు అనే నెపంతో.. కోట్లు దండుకునే సంతకాన్ని సి.ఎం. పెట్టినప్పుడు 'ప్రజలు మాకు సాయం చేశారనీ ఫీలవుతారు. మనం వారిని పీల్చేస్తాం' వంటి కొన్ని డైలాగ్‌లు బాగున్నా.... కథాపరంగా అవి ఉపయోగపడవు.
 
బ్రోకర్‌ అనేవాడు ఏం చేస్తాడు? అంటూ దర్శకుడు మొదటి నుంచి చెబుతున్నా.. అతను ఏమీ చేయలేదు. పాత, కొత్త ముఖ్యమంత్రుల మధ్య తప్పుడు పనులకు సాక్షిగా నిలుస్తాడు. బ్రోకర్‌ పెండ్లి చేసుకున్న భార్యను మాజీ సి.ఎం. కోరుకుంటే.. అది తెలిసి ఎదిరించలేని స్థితి. అసలు ఆ సన్నివేశం చాలా కృతకంగా ఉంటుంది. బ్రోకర్‌ తను తప్పు చేయలేదనే చెప్పే సన్నివేశం కూడా కల్పించలేదు. అదే అమ్మాయిని ఉద్యోగం ఇప్పిస్తానని ఓ ఆఫీస్‌లోకి వచ్చిన ఆమెను రాత్రి పార్టీకి రమ్మంటే అన్నతో పాటు ఎగేసుకుని వెళ్లే సీన్‌... ఆమెను వెంటాడి నలుగురు అనుభవించే సీన్‌.. అంతా చెత్తగా ఉంది. 
 
ఇక ఆ తర్వాత ఢిల్లీ నిర్భయ కేసుపై వేలాదిమంది ప్రజలు రోడ్డు మీదకు రావడం, రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల గుట్టు విప్పేస్తానని సుజనా చౌదరి ఉదంతం.. ఇవన్నీ... జరిగిన సంఘటలను మాత్రమే సినిమాలో చూపించాడు. ఇదికాక.. రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తెనే మాజీ సి.ఎం. కోరుకున్నాడని తెలిపే సన్నివేశం చాలా చీప్‌గా ఉంది. హై సొసైటీలో మహిళలు... నచ్చిన అబ్బాయిలతో ఎంజాయ్‌ చేయడం అనేది హర్ష పాత్ర ద్వారా చూపించాడు. రాజకీయాలంటేనే పుండాకోరులు, దగుల్బాజీలు ఉండే ప్రపంచమంటూ చెప్పే దర్శకుడు ఫ్లాష్‌బ్యాక్‌లో ఆంధ్రప్రజానాట్యమండలి కళాకారుడినని గర్వంగా చెప్పి సినిమా తీశాడు.
 
అసలు రాజకీయాలు ఎలా ఉండాలి? నాయకుడు ఎలా ఉండాలని చెప్పే తొందరలో ఏదో కొన్ని సంఘటనలు అల్లేసి... చివర్లో ఏదో ముగింపు ఇచ్చేయడం అనేది సినిమా కాదు. ఈ సినిమాలో బ్రోకర్‌ పనులకంటే బ్రోతల్‌ పనులే కన్పించాయని హాలులో కొందరు అనుకోవడం కనిపించింది. మరి ఈ బ్రోకర్ ఎలా నెగ్గుకు వస్తాడో వెయిట్ అండ్ సీ.

Share this Story:

Follow Webdunia telugu