Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెల్లెల్ని చంపినోడి పెళ్లానెత్తుకుపోయే "విలన్"!

Advertiesment
విలన్ సినిమా రివ్యూ
WD
నటీనటులు : విక్రమ్, పృథ్వీరాజ్, ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్, ప్రభు, కార్తీక్ తదితరులు.
కెమెరా: సంతోష్‌శివన్,
సంగీతం : ఎ.ఆర్. రెహమాన్,
పతాకం : మద్రాస్ టాకీస్,
నిర్మాత : మణిరత్నం శారద,
దర్శకత్వం : మణిరత్నం.

పాయింట్ : రామాయణం బేస్ కథ. రావణాసురుడిలాంటి ఓ వ్యక్తిని పట్టే క్రమంలో అతని చెల్లెల్ని పోలీసు అధికారి మట్టుబెడతాడు. దాంతో కోపోద్రిక్తుడైన "విలన్" ఆ పోలీసు అధికారి భార్యను తనవద్దే ఉంచుకుంటాడు.

బిజినెస్ టెక్నిక్‌ను ఉపయోగించి దర్శకుడు మణిరత్నం రామాయణానికి, విలన్‌కు సంబంధంలేదని పలుసార్లు స్టేట్‌మెంట్లు ఇచ్చి, ఇదేదో కొత్త కథనే భ్రమకల్పించాడు. అసలు రామాయణానికి సంబంధమేలేదని చెబుతూ పేరు మాత్రం రావణ్స రావణన్, విలన్ అంటూ మూడు భాషల్లో ఆర్టిస్టుల్ని అటూఇటూ మార్చి తీసి కోట్ల రూపాయల వ్యాపారం చేసుకున్నాడు.

"చేయితిరిగిన రచయిత ఒకాయన అంటుంటేవాడు.. రాజు, ఏడుచేపల కథే అయినా దాన్ని చెప్పే విధానం కొత్తగా ఉంటే.. ఎన్ని సినిమాలైనా తీయవచ్చునని". అది తెలిసిన మణిరత్నం చేసిన ప్రయోగమే విలన్. మొదటి భాగం సప్పగా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా రెండో భాగంలో కాస్త ఆసక్తి కలుగజేశాడు. పేరు పొందిన నటీనటులు ఉండటం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ.

ఇక కథలోకి వెళితే.. బడుగువర్గాల కోసం పాటుపడేవాడు వీరయ్య (విక్రమ్). కానీ ప్రభుత్వం దృష్టిలో అతనొక మిలిటెంట్. అతని ఆగడాలకు చెక్ పెట్టాలని రంగంలోకి దిగుతాడు ఎస్.పి. దేవ్ (పృథ్వీరాజ్). అయితే దేవ్‌చేసే దాడిలో వీరయ్య చెల్లెలు వెన్నెల (ప్రియమణి) చనిపోతుంది. దీంతో ఉగ్రుడైన వీరయ్య దేవ్‌ను అదేరూటులో బుద్ధి చెప్పాలని ఆయన భార్య రాగిణి (ఐశ్వర్యారాయ్)ను కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత కేరళ తదితర అడవుల్లో వీరిద్దరి ప్రయాణం ఎలా జరిగింది? తన భార్యను కాపాడుకోవాలనే క్రమంలో వీరయ్య అంతమొందించాలనే క్రమంలో దేవ్ ఏం చేశాడు? అన్నది సినిమా.
webdunia
WD


విశ్లేషణ: పేరుకు తగినట్లే విలన్ అనేది విక్రమే అని తెలిసిపోతుంది. ఇందులో అందరూ బాగానే చేశారు. వీరయ్య తన పాత్రకు న్యాయం చేశాడు. అన్నగా పడే ఆవేదనలో నటనను పండించాడు. వృత్తిపరంగా దేవ్‌‌‌‌‌‌‌‌పాత్రలో పృథ్వీరాజ్ నటన అమోఘం. రాగిణి లోలోపల జరిగే సంఘర్షణ బాగా రక్తికట్టించిది ఐశ్వర్యారాయ్.

మొదటినుంచి మణిరత్నం చెబుతున్నట్లు.. ఏది తప్పు? ఏది రైట్? ఏది న్యాయం? ఏది అన్యాయం? అంటూ కథాగమనంలో కొన్ని సంభాషణలు ఆలోచింపజేస్తాయి. సుగ్రీవుడిని అడ్డుపెట్టుకుని వాలిని చంపిన రాముడు, సీతను పావుగా పెట్టుకుని రావణసంహారం అనేవి తప్పేకావని ఇతిహాసాలు చెబుతున్నాయి.

అదే తీరుని విలన్‌లో మణిరత్నం చెప్పాడు. వీరయ్య పాత్రలో విక్రమ్ తన కొత్త మేనరింజతో విజృంభించాడనే చెప్పాలి. సొంత వాయిస్‌తో డబ్బింగ్ చెప్పి మెప్పించాడు. ఐశ్వర్యారాయ్ తన పాత్రకు న్యాయం చేసింది. ఆమె అందం చిత్రానికి నిండుదన్నాన్నించింది. ప్రభు, కార్తీక్ ఇందులో కీలకమైన పాత్రల్లో బాగా చేశారు. ప్రియమణి కూడా సొంత వాయిస్‌తో, నటనలోనూ మెప్పించింది.

ఇక పాటల పరంగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్. రెహమాన్ ట్యూన్స్ అన్నీ బాగుంటాయి. విలన్‌లో "కుళ్ళుకుంటే కుళ్ళబొడిచెయ్" అనేపాట ఆహ్లాదంగా ఉంది. మిగిలిన పాటలు మామూలుగానే ఉన్నాయి. పెద్దగా ఆకట్టుకోవు. బ్యాక్‌గ్రౌండ్ సంగీతం ఆకట్టుకునేలా చేశాడు.

అడవుల్లో సినిమాను తీయడంతో సంతోష్‌శివన్ కెమెరాకు చాలా పని పెట్టాడు. అన్నీ ప్రకృతి అందాలు బాగా వచ్చాయి. తమిళంలో సుహాసిని మణిరత్నం మాటలు రాశారు. తెలుగులో శ్రీరామకృష్ణ అనువదించారు. కొన్ని సంభాషణలు పేలవంగా ఉన్నాయి.

నిర్మాణపరంగా మణిరత్నం ఎక్కడా రాజీపడకుండా చేశాడని ప్రతిషాట్‌లో తెలుస్తుంది. మణిరత్నం ట్రేడ్‌మార్క్‌తో కొద్దిరోజులు ఆడవచ్చునేమోగాని, కమర్షియల్‌గా ఈ చిత్రం పెద్దగా సక్సెస్‌కాకపోవచ్చు. బిగ్‌సి గ్రూప్‌ద్వారా ఈ సినిమా విడుదలైంది. ఇటీవలే లండన్‌లో ప్రీమియర్ వేసిన రోజునే ఈ సినిమాకు పెద్ద టాక్‌లేదని వార్తలు వచ్చాయి. సినిమా చూశాక అది నిజమేననిపిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu