కుమారి అవని రెడ్డి వీసవరం కూచిపూడి అరంగేట్రం అక్టోబర్ 15వ తేదీ సాయంత్రం శిల్పకళా వేదిక వద్ద జరిగింది. తెలంగాణా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ మామిడి హరికృష్ణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన అవని కూచిపూడి నాట్యం, ఆహుతులను సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తింది. పురందరదాస్ దేవరనామాలతో మొదలుపెట్టి గజవదనే; ప్రహ్లాద శబ్దం, తారంగం, శివాష్టకం మరియు థిల్లానాలను అవని ప్రదర్శించింది. తన నాలుగో సంవత్సరంలో గురు లతా మంజూష వద్ద కూచిపూడి నాట్యం నేర్చుకోవడం ప్రారంభించిన అవని, ప్రస్తుతం మంతన్ స్కూల్‌లో చదువుతుంది.
తన అరగేట్రం ముగిసిన తరువాత అవని మాట్లాడుతూ, తను నాట్యకారిణిగా మరింత మంది ప్రజలకు చేరువకావాలనుకుంటున్నానంది. ప్రపంచంలో ప్రతి మూలకూ కూచిపూడి నాణ్య వైభవాన్ని తీసుకువెళ్లాలనుకుంటున్నట్లు తెలిపింది. తమ తల్లిదండ్రులు బాల రెడ్డి, రజినీల సహకారం వల్లనే ఈ కార్యక్రమం విజయవంతమైందని వెల్లడించింది.
అవని గురువు లతా మంజూష తన ఆనందాన్ని వ్యక్తీకరిస్తూ, అవని తమ ఇనిస్టిట్యూట్‌లో చేరినప్పుడే ఆమె కళ్లలో మెరుపు చూశాను. కూచిపూడి నేర్వాలన్న ఆమె తపన, గ్రహణ శక్తి ఆమెను చక్కటి నాట్యకారిణిగా మలిచాయి అని అన్నారు.
తెలంగాణా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ, చిన్న వయసులోనే అద్భుత ప్రతిభను అవని రెడ్డి ప్రదర్శించింది. విజయవంతమైన కూచిపూడి నృత్యకారిణిగా నిలిచేందుకు పుష్కలమైన అవకాశాలు ఆమెకు ఉన్నాయి. ఈ అరంగేట్రం కోసం ఆమె పడిన కష్టం షోలో ప్రతిబింబించింది. అవనిని ఇతర విద్యార్థులు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి అని అన్నారు.
అవని మాతృమూర్తి రజిని మాట్లాడుతూ, మన సంస్కృతి, సంప్రదాయాలంటే తనకు ఎనలేని గౌరవమన్నారు. తన కుమార్తెలో నృత్యం పట్ల ఆసక్తిని గమనించి కూచిపూడి తరగతులకు పంపామంటూ ఆమె నేడు చేసిన ఈ ప్రదర్శన పట్ల పూర్తి ఆనందంగా ఉన్నానన్నారు.