తమిళ హీరో అయిన విజయ్ సేతుపతి ప్రయోగాత్మక పాత్రలను ఎంచుకుంటూ తెలుగులో కూడా మంచి గుర్తింపు సాధించారు. హీరో అయినప్పటికీ ప్రత్యేక పాత్రలు కూడా చేస్తూ మెప్పిస్తున్నాడు ఈ స్టార్ హీరో. ఇటీవల విడుదలైన పేటలో కీలక పాత్ర పోషించారు, సైరా సినిమాలో కూడా కనిపించనున్నారు. తాజాగా విజయ్ చేసిన ట్వీట్ అంటూ భగవద్గీతను అవమానిస్తున్నట్లు పెట్టిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాయి.
ఆ ట్వీట్‌లో "భగవద్గీత ఆధ్యాత్మిక పుస్తకం కాదు. అందులో రాసిన కల్పిత అంశాల వల్లే సమాజం దిగజారుతోంది" అని ఉంది. ఇది చూసిన నెటిజన్లు విజయ్ సేతుపతిని తప్పుగా అర్థం చేసుకున్నారు. దీనిపై విజయ్ ప్రతిస్పందస్తూ తాను ఎప్పటికీ ఇలాంటి పనులు చేయనని, ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించనని స్పష్టం చేస్తూ అసలు విషయం బయటపెట్టారు.
తమిళనాడు పోలీసులు మొబైల్‌ల చోరీలను అరికట్టేందుకు ప్రవేశపెట్టనున్న కొత్త విధానాన్ని ప్రశంసిస్తూ చేసిన ట్వీట్ వార్తలలో రాగా, దానిని ఎవరో ఫోటోషాప్ చేసి ఇలా చేసారని చెప్తూ ఒరిజినల్, నకిలీ రెండు ట్వీట్‌లను పెట్టాడు. ఇలాంటి నకిలీ వార్తల బెడద సెలబ్రిటీలకు తప్పడంలేదు.