అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఏకధాటిగా ఆమెపై విరుచుకుపడింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడితో ఈ వివాదం ముగిద్దాం అని చెప్పిన తర్వాత కూడా ట్వీట్స్ ఆగలేదు. హీరో నాగార్జున తాను సురేఖపై వంద కోట్ల రూపాయలకు మరో దావా వేస్తానని పేర్కొన్నారు. ఆయన కుమారుడు అఖిల్ అక్కినేని అయితే కొండా సురేఖ జీవితంలో క్షమించలేమంటూ ట్వీట్ చేశారు.
ఈ వివాదంపై కాంగ్రెస్ సీనియర్ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా ముందుకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ పెద్దలకి వేరెవరి మీద అయినా ప్రత్యేక అభిమానం ఉంటే అది మీ వద్దనే దాచుకోండి, మమ్మల్ని ఊరికే విమర్శిస్తామంటే కుదరదంటూ కామెంట్స్ చేశారు.
మంత్రి కొండా సురేఖను అవమానిస్తూ పెట్టిన పోస్టులపైనా.. సినిమా వాళ్లు స్పందిస్తే బాగుండేదని మంత్రి పొన్నం పేర్కొన్నారు. నాడు ఆవేదనలో సురేఖ మాట్లాడారు.. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా.. దాడి అవసరమా అంటూ ప్రశ్నించారు. బలహీనవర్గాలకు చెందిన మంత్రి కొండా సురేఖ ఒంటరి అనుకోకండి అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కాగా కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టులో నాగార్జున పరువునష్టం దావా వేశారు.. సోమవారం దీనిపై విచారణ జరగే అవకాశం ఉంది.