గత కొన్ని వారాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దగా సినిమాలు విడుదల కాలేదు. చివరిగా పెద్ద సినిమా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్.. ఏప్రిల్ 5న తెరపైకి వచ్చింది. అయితే, అది బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. చివరిసారిగా మార్చి 29న విడుదలైన టిల్లు స్క్వేర్ పెద్ద హిట్. అలా టాలీవుడ్ సక్సెస్ ఫుల్ మూవీని చూసి దాదాపు నెలన్నర కావస్తోంది.
సార్వత్రిక ఎన్నికలు, ఐపీఎల్ కారణంగా నిర్మాతలు సినిమాలను విడుదల చేయడం లేదు. దీంతో గత 50 రోజులుగా ఎలాంటి వ్యాపారం లేకుండా థియేటర్లు ఖాళీ అయ్యాయి. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు బిజినెస్ లేకపోవడంతో భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. దీంతో తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు వచ్చే రెండు వారాల పాటు తమ థియేటర్లను మూసివేయాలని నిర్ణయించుకున్నారు.
తక్కువ ఆక్యుపెన్సీ రేట్లు కారణంగా వారు గణనీయమైన నష్టాలను నివేదించారు. ఆర్థిక ఇబ్బందులతో వారు స్వతంత్రంగా థియేటర్లను మూసివేయాలని నిర్ణయించుకున్నారు. తమ వ్యాపార పునరుద్ధరణ కోసం థియేటర్ అద్దెలు పెంచాలని నిర్మాతలను కోరారు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత థియేటర్లను తిరిగి తెరవాలని ప్లాన్ చేస్తున్నారు.